PCC President : ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు తెలంగాణ కొత్త అధ్యక్షుడి నియామకం పై తుది నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రాజకీయ సమీకరణాల అనంతరం ఎవరిని నియమించాలనే విషయంపై కాంగ్రెస్ పెద్దలు ఇప్పటికే ఒక తుది నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలంగాణలో ప్రస్తుత సమీకరణాలు, రాజకీయ విధేయత, సీనియారిటీ, పార్టీలో అనుభవం కొలతబద్ద ఆధారంగా నూతన తెలంగాణ పీసీసీ చీఫ్ ను నియమించినట్టు సమాచారం.
తెలంగాణ సీనియర్ నేతలు కొందరు గత కొన్ని రోజుల నుంచి ఢిల్లీ వదిలిపెట్టి రావడం లేదు. అధిష్టానం పెద్దల చుట్టూ ఇంకా ప్రదక్షణలు చేస్తూనే ఉన్నారు కొందరు ఆశావహులు. ఎవరికి వారే ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ గుట్టు చప్పుడు కాకుండా తమ వంతు ప్రయత్నాలు అధిష్టానం పెద్దల వద్ద చేస్తున్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అధిష్టానం మాత్రం తన పని తానూ చేస్తూనే ఉంది.
బీసీ సామజిక వర్గం నేతలు మధు యాష్కీ, మహేష్ కుమార్ గౌడ్ లు కొంత వరకు ముందు వరసలో ఉన్నట్టు సమాచారం. బలరాం నాయక్ ఎస్టీ సామజిక వర్గం నుంచి, సంపత్ కుమార్ ఎస్సీ సామజిక వర్గం నుంచి పోటీలో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతల్లో ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడు అవుతున్నారని ఎన్నికల తరువాత జోరుగా ప్రచారం జరిగింది.
సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మహేష్ కుమార్ గౌడ్ వైపు మొగ్గుచూపగా, ఢిల్లీ పెద్దలు కూడా కొద్దీ రోజుల్లోనే ప్రకటించే అవకాశం ఉందనే వార్తలు వెల్లడయ్యాయి. అయితే అధిష్టానం మాత్రం ఎంపీ బలరాం నాయక్ కు పీసీసీ పగ్గాలు అప్పగించడానికి సిద్ధమైనట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. నాయక్ గతంలో కేంద్ర మంత్రిగా భాద్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఢిల్లీ పెద్దలతో ఆరోగ్యకరమైన వాతావరణం ఉంది. పార్టీకి నమ్మిన బంటుగా పేరు ఉంది. కాబట్టి రాజకీయ కొలత బద్ద ఆధారంగా నాయక్ కె రాష్ట్ర పీసీసీ పగ్గాలు అప్పగించనున్నారని సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన అనంతరమే నాయక్ ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలిసింది.