Thirumala : తిరుమల ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మినీ బ్రహ్మోత్సవం పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నారు. భారీ ఏర్పాట్లను చేపట్టనున్నామని టీటీడీ బోర్డు ప్రకటించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తిరుమల కొండపై నిర్వహించే మినీ బ్రహ్మోత్సవంకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మినీ బ్రహ్మోత్సవంను తిరుమలలో 2025, ఫిబ్రవరి 4న నిర్వహించనున్నారు. నాలుగో తేదీన తిరుమలలో జరగనున్న వెంకటేశ్వర స్వామి రథసప్తమి వేడుకకు టీటీడీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమి సూర్య జయంతిని పురస్కరించుకొని రథసప్తమి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇటీవల వైకుంఠ ఏకాదశి దర్శనాల్లో అపశృతి చోటుచేసుకొంది. ఇలాంటివి పునరావృతం కారాదని టీటీడీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేస్తోంది.
మినీ బ్రహ్మోత్సవం మాదిరిగా జరగనున్న రథసప్తమి వేడుక ఏర్పాట్లను సాధ్యమైనంత వరకు పూర్తి చేయాలని టీటీడీ ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో శుక్రవారం అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరిలతో కలిసి వివిధ విభాగాల అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.