Joginapalli : గులాబీ అధినేత కేసీఆర్ కు నిత్యం అందుబాటులో ఉంటూ సేవలు చేసిన జోగినపల్లి సంతోష్ జాడ ఎక్కడ అంటూ గులాబీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నారు. కేసీఆర్ ఉదయం నిద్ర లేచింది మొదలుకొని , రాత్రి పడుకునే వరకు జోగినపల్లి వెన్నంటి ఉండేవారు. కేసీఆర్ నిద్రపోతేనే సంతోష్ ఇంటికి వెళ్ళేది. తెలంగాణ లో అధికారంలో ఉన్నన్ని నాళ్ళు సంతోష్, సంతోష్ . ఇదే పేరు అటు గులాబీ శ్రేణులతో పాటు, పలువురు ఉన్నతాధికారులు జపం చేసేవారు. ఇప్పుడు జోగినపల్లి పేరు జపించుదామంటే జాడలేకుండా పోయిండు.
వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు. ఎక్కడో ఎదో వ్యాపారం చేసుకుంటున్నాడు అంటే పెద్దనాన్న కేసీఆర్ సంబరపడిపోతారు. కానీ ఇటు పార్టీలో కనబడుతలేరు. వ్యాపారం చేస్తున్నాడా అంటే అదికూడా లేదు. చివరకు పెద్దనాన్న ఇంటి వద్ద అప్పుడప్పుడు కనబడుతున్నాడా అంటే అసలే లేదు. ఇప్పుడు జోగినపల్లి సంతోష్ మొక్కలు పట్టుకొని బీజేపీ రాష్ట్రాల్లో తిరుగుతున్నాడని గులాబీ శ్రేణులు ఒకటే గుసగుస. ఇది తెలిసిన కొందరు గులాబీ శ్రేణులు ఇదేం వ్యవహారం అంటున్నారు.
కాంగ్రెస్ ను ఎదుర్కొంటున్న బిఆర్ఎస్ శ్రేణులకు అందుబాటులో ఉండటంలేదనే విమర్శలు సైతం వస్తున్నాయి. ఇక్కడ పార్టీలో అందుబాటులో ఉండకుండా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కార్యక్రమాలు చేపడుతున్నారు. గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహించడంపై పార్టీలో అనుమానాలు తలెత్తుతున్నాయి. లిక్కర్ పాలసీ వ్యవహారాలను కేసీఆర్ కు అందించలేదని, ఆమె అరెస్ట్ కు కూడా కొంత జోగినపల్లి కారకుడనే ఆరోపణలు సైతం వ్యక్తం అయ్యాయి. కవిత అరెస్ట్ అయినప్పుడు, ఆ తరువాత బెయిల్ పై విడుదల అయినప్పుడు మినహా కవితను పరామర్శించడానికి మధ్యలో ఢిల్లీకి జోగినపల్లి వెళ్ళలేదు.
గులాబీ శ్రేణులు తెలంగాణలో కాంగ్రెస్ ను, బీజేపీ ని ఎదుర్కొంటున్నారు. ఆయనేమో అస్సాం, ఒడిశా లో మొక్కలు నాటుతున్నారు. ఈ విషయం బిఆర్ఎస్ నేతల్లో పెద్ద టాక్ అయ్యింది. తెలంగాణాలో పార్టీని పట్టించుకోకుండా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జోగినపల్లి ఎందుకు మొక్కలు నాటుతున్నారు అనేది పార్టీ లో పెద్ద పజిల్ అయ్యింది. కాషాయం కండువా కప్పుకోడానికి నేరుగా వెళితే బీజేపీ పెద్దలు దూరం పెడతారు. అందుకనే సంతోష్ రావు మొక్కలు నాటి కాషాయం నేతలను సంతోష పెడుతున్నారనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం కావడం విశేషం.