Different in both parties : తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలుకొని పార్లమెంట్ ఎన్నికల వరకు కాంగ్రెస్ , సీపీఐ పార్టీలు చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. పొత్తు పెట్టుకొని పోటీచేశారు. రెండుపార్టీల వారు అనుకున్నట్టుగానే రాజకీయ అవసరాలు తీర్చుకున్నారు. కానీ ఇద్దరి మధ్య దోస్తానా చెడిందా ? లేదంటే ప్రజల సమస్యల కోసం సీపీఐ మాట్లాడక తప్పడం లేదా ? ఇంకా రాజకీయంగా అంతర్గతంగా ఏమైనా ఇద్దరి మధ్య తేడాలు వచ్చాయా అనే అనుమానాలు సైతం రెండు పార్టీల శ్రేణుల్లో వ్యక్తం అవుతున్నాయి.
అధికారంలోకి వచ్చిన కొత్తలో రెండు పార్టీల నాయకులు ఆరోగ్యకరమైన వాతావరణంలోనే ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే కూనంనేని సాంభశివరావు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగానే నిలిచారు. సమావేశాల్లో అంశాల వారీగా ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. కొద్ది రోజుల కిందట సీపీఎం నేతలు రాఘవులు, జూలకంటి రంగారెడ్డి సహా పలువురు నేతలు సైతం సీఎం రేవంత్‌తో ప్రజా సమస్యలపై చర్చించారు. సిపిఎం కూడా కాంగ్రెస్ తో స్నేహపూర్వక వాతావరణం కొనసాగిస్తుందని రాజకీయ వర్గాలు అనుకున్నారు. ఇంతలో సీపీఐ కాంగ్రెస్ పార్టీల మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు. కానీ ఇద్దరి మద్య అనారోగ్య కరమైన వాతావరణం మాత్రం స్పష్టంగా కనబడుతోంది.
ఎన్నికల్లో రాజకీయ అవసరాలు తీరినాయి. ఎన్నికలకు ఇంకా చాల సమయం ఉంది. అప్పటివరకు ఉన్న పరిస్థితులను బట్టి ఆలోచించేది. కాబట్టి తమ ఉనికిని చాటుకోడానికి ప్రజల్లోకి వెళ్ళాలి. కాబట్టి ప్రభుత్వ పనితీరును ఎండగడుతూ ప్రజల్లోకి ఎర్రజెండాలు వెళుతున్నాయనే అభిప్రాయాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రజాసమస్యలపై పోరాటం మంచిదే, కానీ ఎన్నికల్లో లబ్ది పొంది, ఇప్పుడు దూరం కావడంపైననే కాంగ్రెస్ వర్గాలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ పనితీరుపై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కితాబు ఇచ్చారు. కొన్నిరోజుల నుంచి అయన ప్రభుత్వం గురించి మాట్లాడుతున్న మాటలు తేడాగానే కనబడుతున్నాయి. రుణమాఫీ విషయంలో అండగా నిలవాల్సిన సీపీఐ మరోవిదంగా మాట్లాడుతోంది. కొద్ది రోజుల కిందట ఖమ్మం పర్యటనలో ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావ్ ను సీపీఐ శ్రేణులు అడ్డుకోవడం జరిగింది. ఈ విషయం రాజకీయ శ్రేణుల్లో పెద్ద చర్చనీయాంశమైంది. మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఎర్ర చొక్కాలకు సర్దిచెప్పుకోవాల్సి వచ్చిందంటే ఇద్దరి మధ్య పరిస్థితి ఏ మేరకు చేరుకుందో అర్థం చేసుకోవచ్చు.
ఒక్క రుణమాఫీ విషయం గురించి మాట్లాడితే సరిపెట్టుకోవచ్చు. కానీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. హామీలను అమలు చేయని నేపథ్యంలో ప్రజల పక్షాన నిలబడతామంటూ ఎమ్మెల్యే కూనంనేని హెచ్చరించినట్టుగానే మాట్లాడారు. ప్రభుత్వం అమలుచేస్తున్న హైడ్రా విషయంలో కూడా సీపీఐ నిలదీసినట్టుగానే మాట్లాడుతోంది. పేదలు, మధ్యతరగతి ప్రజలకు నష్టం చేస్తే సహించేదిలేదంటూ హెచ్చరించింది ఎర్రజెండా పార్టీ. ఏది ఏమైనప్పటికి సీపీఐ, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రస్తుతం నడుస్తున్న కాలాన్ని గమనిస్తే బంధం దూరం అవుతున్నట్టుగానే కనిపిస్తోంది.