Bjp : ఎమ్మెల్సీ కవితకు ప్రస్తుతం బెయిల్ రావడం అనేది బిఆర్ఎస్ శ్రేణులకు అత్తెసరు సంబరమే. కవిత కేసు విషయంలో ఎన్నో సవాళ్లు ముందు, ముందు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కూతురు కోసం ఇన్ని రోజుల పాటు గడప దాటలేదు కేసీఆర్. ఆయన ఇప్పుడిప్పుడే మానసికంగా కోలుకుంటున్నారు. ఇప్పుడు గులాబీ బాస్ ఆటకు సన్నద్ధమవుతున్నారని నేతలు చెబుతున్నారు.
ఇంతవరకు ఓకే..కానీ బిఆర్ఎస్ ఓటమి చెందిన నాటి నుంచి బీజేపీ నాయకులు ఎన్నో విధాలుగా మాట్లాడారు. ఇప్పుడు కేసీఆర్ బయటకు వస్తున్నారు అని అంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ని కేసీఆర్ ఏమైనా అనగలుగుతారా అనేది బిఆర్ఎస్ నేతల్లో పెద్ద ఫజిల్ అయ్యింది.
పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ నష్టాన్ని ఎదుర్కోవడంతో పాటు అత్యధిక సీట్లల్లో డిపాజిట్ కూడా కోల్పోయింది. ఈ నేపథ్యంలో తనకున్న ఓటుబ్యాంక్ ను బీజీపీ కి బంగారు పళ్లెంలో అప్పగించింది. దింతో బిఆర్ఎస్ పార్టీనే తన ఓట్లను బీజేపీ కి అప్పగించిందని కాంగ్రెస్ ఆరోపించింది. తెరవెనుక ఏమి జరిగిందో తెలియదు కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ లాభపడింది. బిఆర్ఎస్ నష్టపోయింది. ఇప్పుడు ప్రజలకు ఏమని తెలిసిపోయిందంటే మీకు కాంగ్రెస్ పై వ్యతిరేకత ఉంటె బీజేపీ కి ఓటు వేయండి అంటూ బిఆర్ఎస్ చెప్పకనే చెప్పేసింది.
బిఆర్ఎస్ శ్రేణులు బీజేపీ ని పల్లెత్తు మాట అనకుండా కేవలం కాంగ్రెస్ పై దుమ్మెత్తి పోస్తే గులాబీ శ్రేణులకు ఎలాంటి మేలు జరుగదు. దింతో బీజేపీ కె మేలు జరుగుతుంది. బిఆర్ఎస్ కు నష్టం తప్పదని ఈరోజు రాజకీయ ఓనమాలు దిద్దిన కార్యకర్తకు కూడా తెలిసిపోతుంది. తన ఓటు బ్యాంకు ను కాపాడుకోవాలంటే గులాబీ శ్రేణులు కమలం పై యుద్ధం చేయాల్సిందే. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తామేనని బిఆర్ఎస్ బలంగా ప్రజల్లోకి వెళ్ళాలి. కాంగ్రెస్ ను ఢీకొనే సత్తా బీజేపీ కి లేదని, ఆ పార్టీతో సాధ్యం కాదని కూడా ప్రజల్లో గులాబీ శ్రేణులు స్పష్టం చేయాలి.
ఒకవేళ బిఆర్ఎస్ కాంగ్రెస్ తో సమానంగా బీజేపీ ని విమర్శించని నేపథ్యంలో బీజేపీ, బిఆర్ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అంతే కాదు ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడం వెనుక బీజేపీ హస్తం ఉందని కూడా ప్రజలకు కాంగ్రెస్ వివరిస్తుంది. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ మరింత బలహీనం కావడం ఖాయం అవుతుంది. బీజేపీ ని పల్లెత్తు మాట అనకుండా, కేవలం కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఉంటె రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ ఖాళీ కావడం ఖాయం అనే అభిప్రాయాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.