Election : పల్లె పోరులో మెజార్టీ పట్టం ప్రధాన పార్టీల్లో ఎవరికి దక్కుతుందోననే చర్చ రాజకీయ వర్గాల్లో అప్పుడే మొదలైనది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో పల్లెల్లో రాజకీయ నాయకులు పోటీకి సన్నద్ధమవుతున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్ మధ్యనే పోటీ కొనసాగే అవకాశాలు ఎక్కువ. అక్కడక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా రంగంలో ఉండే అవకాశాలు తప్పనిసరి. అత్యధిక స్థానాల్లో ఏ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారో ఆ పార్టీకి రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు బలమవుతుంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీ సాధ్యమైనంత మేరకు ఎక్కువగా అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన పరిస్థితి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో కొంత మోదం, మరికొంత ఖేదం ఉంది. పార్టీ కి ఎమ్మెల్యేలు, ఎంపీలు లేని ప్రాంతాల్లో కష్టపడక తప్పదు. స్థానిక ఎన్నికల్లో ఎంత ఎక్కువ మెజార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తే పార్టీ అంత రాబోయే ఎన్నికల నాటికి అంత బలోపేతమవుతుంది. ఎంత అధికారం ఉన్నప్పటికీ నీడలా కాషాయం, గులాబీ నేతలు వెంటపడుతూనే ఉంటారు. ఈ రెండు ప్రధాన పార్టీలను తట్టుకొని బయట పడటం అంత సులభం కాదనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం కావడం విశేషం.
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఆ పార్టీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సిలు ఉన్నారు. కొత్తగా వచ్చిన రాష్ట్ర అధినేత రామచంద్ర రావు కు ఈ ఎన్నికలు ఆయన పనితీరుకు తార్కాణం కాబోతున్నాయి. ఎంత బలం ఉన్నప్పటికీ అయన పనితీరును ఢిల్లీ పెద్దల వద్ద చూపించుకోవాల్సిన అవసరం ఉంది. అటు కాంగ్రెస్, మరోవైపు బిఆర్ఎస్ తాకిడిని తట్టుకొని ఏ మేరకు నిలబడుతారో వేచిచూడాల్సిందే.
అధికారం కోల్పోయి బిఆర్ఎస్ నేతలు కొట్టుమిట్టాడుతున్నారు. అధినేత ఫామ్ హౌస్ గడప దాటడం లేదు. మరో వైపు ఇంటిపోరు. అభ్యర్థుల తరపున ప్రచార భాద్యతలు ఎత్తుకోవాల్సింది కేటీఆర్, హరీష్ రావు. ఈ ఇద్దరి పైననే అభ్యర్థుల గెలుపు, ఓటమిలు ఆధారపడి ఉన్నవి. ఎంపీలు లేరు. అత్తెసరు ఎమ్మెల్యేల బలంతో పార్టీ పల్లె పోరులో ఏ మేరకు నెట్టుకు వస్తుందో వేచి చూడాల్సిందే.

by