AITUC : అక్టోబర్ 2న గాంధీ జయంతి తో పాటు దసరా పండుగ వచ్చిన నేపథ్యంలో దసరా సెలవును సింగరేణి సంస్థకు 3 తేదీన సెలవు రోజుగా ప్రకటించాలని యజమాన్యంను ఏఐటీయూసీ నాయకులు కోరారు. సోమవారం మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని శాంతి ఖని గని ఆవరణలో యూనియన్ నాయకులు కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఏఐటీయూసి బెల్లంపల్లి, గోలేటి బ్రాంచ్ ఇంచార్జ్ చిప్ప నర్సయ్య మాట్లాడుతూ యాజమాన్యం పునరాలోచించి సెలవు దినాన్ని మార్చాలని సూచించారు.
గత కొన్నేళ్లుగా సింగరేణి కార్మికుల సమస్యలు అపరిషృతంగా ఉన్నాయని, తద్వారా కార్మికులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సొంతింటి పథకం అమలు చేయడంలో యాజమాన్యం పూర్తిగా విఫలమైనదన్నారు. సింగరేణి కార్మికుల హక్కుల సాధన కోసం పోరాటాలే సరైన సమాధానమని ఆయన స్పష్టం చేశారు. ఏఐటీయూసీ చేసిన సుదీర్ఘ పోరాటాల ఫలితంగానే ప్రస్తుతం కార్మికులు హక్కులు అనుభవిస్తున్నారన్నారు.
శాంతిఖని గనిలో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆయన ఆరోపించారు. అనంతరం గని మేనేజర్ కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు వొడ్నాల శ్రీకాంత్, ఈ.. గణేష్, పోగుల రాజేందర్, దుర్గం రాజేష్, ఎం. సంతోష్ కుమార్, డి రామచందర్, టి. రవికుమార్, ఎస్. శ్రావణ్, ఆర్. ప్రవీణ్, టి. బుచ్చయ్య, ఏ. జనార్ధన్ పాల్గొన్నారు.

by