Home » BJP : తెలంగాణ బీజేపీ లో మొదలైన అసంతృప్తి ?

BJP : తెలంగాణ బీజేపీ లో మొదలైన అసంతృప్తి ?

BJP : తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో ఏమి జరుగుతోంది. అంతర్గత పోరు మొదలైనదా ? లేదంటే కాషాయం పెద్దలు పట్టించుకోవడం లేదా ? ఈ రెండింటిలో ఎదో ఒకటి జరిగితేనే కాషాయం శ్రేణుల్లో అసంతృప్తి మొదలవుతుంది. ఈ అభిప్రాయం పార్టీ రేణుల్లో సైతం వ్యక్తం కావడం విశేషం. ఉమ్మడి రాష్ట్రంలో సైతం సాధించని ఎన్నికల ఫలితాలను పార్టీ సాధించింది. అసెంబ్లీ గడప ఎనిమిది మంది తొక్కారు. అదేవిదంగా పార్లమెంట్ లో సైతం ఎనిమిది మంది జెండా ఎగురవేశారు.

ఇంత మంచి ఫలితాలు సాధించిన నేపథ్యంలో పార్టీ లో ఎందుకు చెవులు కొరుక్కుంటున్నారు. రాష్ట్ర నాయకత్వం ఎనిమిది మంది ఎమ్మెల్యేల గురించి పట్టించుకోకపోవడంతోనే అసలు సమస్య తయారైనదని పార్టీ శ్రేణులు పలువురు ఆరోపిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు తాజాగా గెలిచిన ఎమ్మెల్యేలతోపాటు కేంద్ర, రాష్ట్ర స్థాయి నేతలకు అవకాశాలు రావడంలేదు. ఈ నేపథ్యంలోనే పార్టీలో అంతర్గత పోరు మొదలైనట్టుగా తెలుస్తోంది.

రాష్ట్ర నాయకత్వానికి, రాష్ట్రంలోని ఎమ్మెల్యేలకు మధ్య తేడా కూడా వచ్చిందనే చర్చ కూడా పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది. పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్వహించే కార్యక్రమాలకు ఎమ్మెల్యేలను దూరం పెడుతున్నారనే ఆరోపణ కూడా వ్యక్తమవుతోంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం గురించి పార్టీ నాయకత్వం ఎలాంటి సమావేశాన్ని ఎమ్మెల్యేలతో నిర్వహించక పోవడంపై పార్టీలో అసంతృప్తి ఏర్పడింది.

ప్రస్తుతం శాసన సభలో ఉన్న ఎమ్మెల్యేలల్లో ఆరుగురు అసెంబ్లీకి కొత్తవారే. కొత్తగా ఎన్నికయిన వారికి ఏయే అంశాలపై సభలో మాట్లాడాలో చెప్పకపోవడంతో కొందరు ఎమ్మెల్యేలు కూడా రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. సభలో నిర్వహించాల్సిన ఎమ్మెల్యేల భాద్యత పై కూడా నాయకత్వం అంటీ ముట్టనట్టుగా వ్యవహరించడం సరిగాలేదని అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి పార్టీ శ్రేణుల్లో.

రైతు రుణమాఫీ హెల్ప్ లైన్ కేంద్రాన్ని పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యేలను పిలువలేదు. అదేవిదంగా ఆ ఆ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లలో బీజేపీ ఫ్లోర్ లీడర్ ఫోటో లేకపోవడంతో కొందరు ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తికి లోనయ్యారు. ఏది ఏమైనప్పటికీ పార్టీ ఎదుగుతున్న నేపథ్యంలో చిన్న, చిన్న అంశాలే పెద్దగా తయారవుతాయి. ఇది పార్టీకి అనారోగ్యకరమైన వాతావరణాన్ని కూడా ఏర్పాటు చేస్తుందనే అభిప్రాయాలు సైతం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *