Singareni : ఇప్పటి వరకు సింగరేణి చరిత్రలో సంస్థ సి అండ్ ఎండి అధికార హోదాలో గనులపై పర్యటించిన సందర్భాలు చాలా తక్కువ. ఒకవేళ చైర్మన్ హోదాలో వచ్చిన అధికారి నేరుగా గని మేనేజర్ తో మాట్లాడి వెళ్లిన సందర్భాలు మాత్రమే ఉన్నవి. కానీ క్యాంటిన్ లో కార్మికులతో కలిసి అల్ఫాహారం తినడం, చాయ్ తాగడం, గని ఉపరితలంలో కార్మికులతో మమేకమై కలియ తిరగడం, వారికి షేక్ హ్యాండ్ ఇవ్వడం, వారితో సరదాగా మాట్లాడటం, యోగ క్షేమాలు అడగటం, పనితీరు గురించి చర్చించడం, సంస్థ బాగోగులు కార్మికులకు తెలుపడం వంటి సంఘటనలు ఇప్పటివరకు ఏ చైర్మన్ హోదాలో జరుగలేదు.
కానీ ఇటువంటి సంఘటనలు ఇప్పుడు ఉన్న చైర్మన్ బలరాం నాయక్ పర్యటనల్లో మాత్రమే కనబడుతున్నవని కార్మిక వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. బుధవారం చైర్మన్ బలరాం నాయక్ శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాలో పర్యటించారు. ఒక సాధారణ వ్యక్తిలా కార్మికులతో మమేకమై ముచ్చటించారు. కార్మికులకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. కార్మికుల యోగ క్షేమాలు అడిగితెలుసుకున్నారు. గనిలోకి దిగారు.
భూగర్భంలో పని ప్రదేశాల్లో కూడా కార్మికుల మంచి, చెడు గురించి అడిగి తెలుసుకున్నారు. చైర్మన్ ప్రవర్తన చూసిన కార్మికులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇంతకు ఈయన మన చైర్మన్ అంటావా అంటూ చర్చించుకున్నారు. షేక్ హ్యాండ్ ఇవ్వడంతో సంబరపడి పోయారు కార్మికులు. కార్మికుడు, సూపర్ వైజర్, అధికారి అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితో ముచ్చట పెట్టడంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయింది.
చైర్మన్ బలరాం నాయక్ తో పలుఫురు సెల్ఫీ లు, ఫోటోలు దిగి సంబరపడిపోయారు. అంతే కాదు డైరెక్టర్ లు, ఏరియా జనరల్ మేనేజర్, So To GM లు గని తనిఖీకి వచ్చినా మాతో ఈ విదమైన పలకరింపులు ఎప్పుడు కూడా చూడలేదని పలువురు సీనియర్ కార్మికులు గుసగుస పెట్టుకోవడం కొసమెరుపు.