Telangana BJP : తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో కాషాయం పతాకాన్ని ఎగురవేసింది. ఈ ఫలితం ముందస్తు హెచ్చరిక చేసినట్టు. పదేళ్ల అధికారాన్ని బిఆర్ఎస్ కోల్పోయింది. కాంగ్రెస్ అధికార పీఠాన్ని దక్కించుకొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, బీజేపీ ఊహించని విదంగా బలం పెరగడం, గులాబీ బలహీనపడటం జరిగింది. జరిగిన పరిణామంతో గులాబీ శ్రేణుల్లో కొందరు బీజేపీ లో చేరగా, మరికొందరు కాంగ్రెస్ లో చేరారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే పార్లమెంట్ ఎన్నికలకు సమయం ఆసన్నమైనది. ముందుగానే బీజేపీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో ఒక అడుగు ముందుకు వేసింది. కానీ బీజేపీ ప్రచారంలో బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల రెండు బలహీనతల్ని సరిగా ప్రజలకు వివరించలేక పోయిందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలో గులాబీ పార్టీ అందనంత దూరంలోకి వెళ్ళింది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందనే నమ్మకం లేదు. మూడోసారి మోదీ నేతృత్వంలోనే పార్టీ అధికారం లోకి రాబోతోందనే ప్రచారం సాగుతోంది. దేశ వ్యాప్తంగా మోదీ నామ జపం సాగుతోంది. మోదీ హావా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా స్పష్టంగా కనిపించింది. ఆ హవా బీజేపీ ప్రభావం లేని నియోజక వర్గాల్లో సైతం అభ్యర్థుల గెలుపుకు అనుకూలంగా మారింది. ఇటువంటి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని తెలంగాణ కాషాయం పెద్దలు అనుకూలంగా మార్చుకోలేదని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు.
బిఆర్ఎస్ అభ్యర్థులు 17 స్థానాలకు 17 గెలిచినా ఫలితం లేదని బీజేపీ పెద్దలు వివరించడంలో విఫలమైనారు. 17 స్థానాలు గెలిచినా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేరనే విషయాన్నీ రాష్ట్ర పెద్దలు కానీ, ఢిల్లీ పెద్దలు కానీ వివరించలేకపోయారు. అదే విదంగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదనే విషయాన్నీ కూడా తెలంగాణ ప్రజలకు వివరించి బీజేపీ ఆకట్టుకోలేక పోయిందనే అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. ఈ రెండు అస్త్రాలను బీజేపీ ఎందుకు విస్మరించిందో అనే అనుమానం తెలంగాణ ప్రజల్లో తలెత్తింది.