2013 లో భూ సేకరణ చట్టం అమలు
అభివృద్ధికి అడ్డు పడుతున్న బిజెపి, బిఆర్ఎస్
రైతుల ఇష్టప్రకారమే భూముల సేకరణ
Congress : మంచిర్యాల నియోజకవర్గం లో బిఆర్ఎస్, బిజేపి నాయకులే అభివృద్ధి కి అడ్డు పడుతూ, నియోజక వర్గ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం సతీష్ యాదవ్ ఆరోపించారు. బుధవారం ఆయన మంచిర్యాలలో మాట్లాడుతూ వేంపల్లి, పోచంపహాడ్ లో ఆయా సర్వే నంబర్ లోని భూములను అధికారులు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూసేకరణ చేయడం జరిగిందన్నారు. 2013 భూ సేకరణ చట్టం నిబంధనల మేరకు రైతులకు నష్టపరిహారం ఇవ్వడానికి సంబంధిత అధికారులు సిద్ధంగా ఉన్నారన్నారు.
మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గత 10 ఏళ్లలో నియోజకవర్గం లో భూములు సేకరించినప్పుడు ఎంత పరిహారం మంజూరు చేయించారో తెలుపాలని ఆయన సంధర్బంగా డిమాండ్ చేశారు. రైతుల ఇష్టప్రకారమే భూ సేకరణ జరుగుతున్నప్పటికీ బిఆర్ఎస్, బిజేపి నాయకులు కొందరు కాంగ్రెస్ ప్రభుత్వం పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పరిశ్రమలు రావడం ద్వారా ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే ఉద్దేశ్యం తో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు కృషి చేస్తున్నారన్నారు.
నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, రూ.250 కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం,మహా ప్రస్థానం, యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణంతో పాటు రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో కొందరు నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సతీష్ ఈ సందర్బంగా ఆరోపించారు.