Pavan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13న ఎన్నికలు ముగిశాయి. జూన్ నాలుగున ఓట్ల లెక్కింపుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. లెక్కింపు కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ రోజుననే పలు నియోజకవర్గం కేంద్రాలతోపాటు, మండల, పట్టణ కేంద్రాల్లో అల్లర్లు జరిగాయి. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అయ్యాయి. పోలీస్ అధికారులు, సిబ్బంది గాయపడ్డారు. ప్రజలకు ఆస్తినష్టం జరిగింది. పదుల సంఖ్యలో ఓటర్లు గాయపడ్డారు. జరిగిన దాడులపై ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ఉన్నతాధికారులను బదిలీ చేసింది. సిట్ ఏర్పాటు చేసింది. అయినా ఇంకా ఎక్కడో నిఘా అధికారులకు అనుమానం.
రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు రోజున అల్లర్లు జరిగే అవకాశాలు ఉన్నాయని కేంద్ర నిఘా సంస్థలు గుర్తించాయి. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర బలగాలను రంగంలోకి దింపింది. ప్రధానంగా రెండు నియోజక వర్గాల్లో కేంద్ర బలగాలు మోహరించాయి. ఒకటి పిఠాపురం. రెండోది కాకినాడ. ఈ రెండు నియోజవర్గాల్లో కేంద్ర బలగాలు భారీ ఎత్తున నిలిచాయి. జూన్ 19 వరకు అక్కడే ఉంటాయి. ముందు జాగ్రత్తలో భాగంగానే పోలీస్ బలగాలు రావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
ఓట్ల లెక్కింపు రోజున పిఠాపురం, కాకినాడలో అల్లర్లు జరుగుతాయని కేంద్ర నిఘా సంస్థ హెచ్చరించింది. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలో ఉన్నారు. అక్కడ ఆయన గెలుపు ఖాయమని ప్రచారం సాగుతోంది. అదేవిదంగా కాకినాడ నుంచి ద్వారపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి బరిలో ఉన్నారు. పిఠాపురంలో అల్లర్లు సృష్టించే అవకాశాలు ఉన్నాయని నటుడు నాగబాబు అనుమానం వ్యక్తం చేశారు. అదేవిదంగా కాకినాడలో చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. కాకినాడలో నీ రౌడీయిజాన్ని అడ్డుకుంటానని పవన్ కళ్యాణ్ గతంలో చంద్రశేఖర్ రెడ్డి ని ఉద్దేశించి అన్నారు. చంద్రశేఖర్ రెడ్డికి ప్రైవేట్ సైన్యం ఉందనే అనుమానాలు సైతం ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు ప్రాంతాల్లో అల్లర్లు జరిగే అవకాశాలు ఉన్నాయని కేంద్ర నిఘా సంస్థలు గుర్తించాయి. లెక్కింపుకు ముందే రంగంలోకి దిగిన బలగాలు అన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించాయి.