కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
యాదగిరిగుట్టలో అక్టోబర్ 26, 27, 28 తేదీల్లో ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్ సర్కిల్ రాష్ట్రస్థాయి సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన కామారెడ్డి సర్కిల్‌కు చెందిన కళాకారులను మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో బీబీపేట మండలానికి చెందిన రాష్ట్రస్థాయి కళాకారులతో పాటు కామారెడ్డి సర్కిల్ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన పలువురు కళాకారులు, మహిళా కళాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 3న కామారెడ్డి సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ సాల్య నాయక్ తన కార్యాలయంలో విజేతలతో పాటు కార్యక్రమాల్లో పాల్గొన్న కళాకారులను శాలువాలు, పూలమాలలు, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఎస్ఈ సాల్య నాయక్ మాట్లాడుతూ.. బీబీపేట మండలంతో పాటు కామారెడ్డి సర్కిల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు రాష్ట్రస్థాయి వేదికపై తమ ప్రతిభను ప్రదర్శించి కామారెడ్డి సర్కిల్‌కు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావడం అభినందనీయమన్నారు. కళాకారులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.అనంతరం డివిజనల్ ఇంజనీర్ మాట్లాడుతూ.. విద్యుత్ రంగానికి తమ విధులు, సేవలు అందిస్తూనే రాష్ట్రస్థాయిలో బహుమతులు సాధించి సర్కిల్‌కు గుర్తింపు తీసుకొచ్చిన కళాకారుల ప్రతిభను ఎన్నటికీ మరువలేమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ ఉమ్మడి జిల్లా అధికారులు గోపి, బద్రి అనిల్ మాట్లాడుతూ.. కామారెడ్డి సర్కిల్‌కు కీర్తి ప్రతిష్ఠలు తీసుకొచ్చిన కళాకారులు, మహిళా కళాకారులకు అభినందనలు తెలిపారు. కళాకారులను ప్రోత్సహించడం ద్వారా మరింత ప్రతిభ వెలుగులోకి వస్తుందని అన్నారు.అవార్డు గ్రహీత, రాష్ట్రస్థాయి కళాకారుడు ఎం. నాంపల్లి మాట్లాడుతూ.. కళాకారుల్లో స్ఫూర్తిని నింపి, తమ ప్రతిభను గుర్తించి ఘనంగా సన్మానించిన ఉమ్మడి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారులు గోపి, బద్రి అనిల్, ఎస్ఈ సాల్య నాయక్, డివిజనల్ ఇంజనీర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ అధికారులు గోపి, బద్రి అనిల్, రాష్ట్రస్థాయి కళాకారులు ఎం. నాంపల్లి, టి. స్వామి, ప్రత్యేక జ్యూరీ అవార్డు అందుకున్న మహిళా కళాకారులు, వివిధ యూనియన్ల నాయకులు, ఇతర కళాకారులు పాల్గొని అవార్డు గ్రహీతలను అభినందించారు.

