మల్లన్నసాగర్ నుంచి ఎత్తిపోతల పథకం హామీని అమలు చేయాలి
ముదిరాజ్ సంఘం కామారెడ్డి జిల్లా కార్యదర్శి కొరివి నరసింహులు
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
బీబీపేట: రైతుల సాగునీటి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి బీబీపేట చెరువును పూర్తిస్థాయిలో నింపేందుకు చర్యలు చేపట్టాలని ముదిరాజ్ సంఘం కామారెడ్డి జిల్లా కార్యదర్శి కొరివి నరసింహులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై ప్రెస్‌నోట్ విడుదల చేసిన ఆయన మాట్లాడుతూ.. మండలంలో 500 ఎకరాలకు పైగా విస్తీర్ణం కలిగిన బీబీపేట చెరువు ప్రస్తుతం పూర్తిస్థాయిలో నిండే పరిస్థితి లేకపోవడంతో ఈ చెరువు కింద ఆధారపడిన వేలాది మంది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
నైజాం కాలం నుంచి బీబీపేట చెరువు గొలుసుకట్టు చెరువుగా కొనసాగుతూ, దీని కింద ఉన్న అనేక గ్రామాల రైతులకు సాగునీటిని అందిస్తూ వచ్చిందన్నారు. గతంలో ఈ చెరువు నిండితే వేల ఎకరాల్లో పంటలు సాగయ్యేవని, అనేక కుటుంబాలకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉండేదని పేర్కొన్నారు. ప్రస్తుతం చెరువును పట్టించుకునే నాథుడు లేకపోవడంతో రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మల్లన్నసాగర్ హామీ ఏమైంది?
బీబీపేట చెరువుకు మల్లన్నసాగర్ నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా భారీ పైపులైన్ ఏర్పాటు చేసి నీటిని తరలిస్తామని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని నరసింహులు గుర్తుచేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే హామీ ఇచ్చిందన్నారు. ప్రస్తుతం మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. మల్లన్నసాగర్ నుంచి బీబీపేట చెరువుకు ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి నీటిని తరలించడంతో పాటు, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కూడా చెరువును నింపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. చెరువులో కనీసం ఒక టీఎంసీ నీరు నిల్వ ఉండేలా శాశ్వత ప్రణాళిక రూపొందించాలని విజ్ఞప్తి చేశారు.
చారిత్రక ప్రాధాన్యత కలిగిన చెరువు
నైజాం కాలంలో బీబీపేట ప్రాంతంలో తమలపాకు తోటలు విస్తారంగా ఉండేవని నరసింహులు తెలిపారు. ఇక్కడ పండించిన తమలపాకులను లారీల ద్వారా కలకత్తా తదితర ప్రాంతాలకు తరలించి వ్యాపారం చేసేవారని పేర్కొన్నారు. బీబీపేట తమలపాకులకు అప్పట్లో ప్రత్యేక గుర్తింపు ఉండేదని, చెరువులో సమృద్ధిగా నీరు ఉండటం వల్లే ఇలాంటి పంటలు విస్తారంగా సాగయ్యేవని వివరించారు. నైజాం కాలంలో నిర్మించిన చెరువు కట్ట, తూములు, కాలువల వ్యవస్థకు చారిత్రక ప్రాధాన్యత ఉందన్నారు. అప్పట్లో గొలుసుకట్టు విధానంలో చెరువులు, కాలువలు అనుసంధానమై ఉండేవని, ప్రస్తుతం అనేక కాలువలు ఆక్రమణలు, నిర్లక్ష్యం కారణంగా కుచించుకుపోయాయని తెలిపారు. పాత తూములు, కాలువలను పునరుద్ధరించి చెరువు నీటి సామర్థ్యాన్ని పెంచాలని కోరారు.
ఏడు గ్రామాలకు సాగునీటి ఆధారం
బీబీపేట చెరువుపై ఇసానగర్, ఉప్పరపల్లి, నస్కల్, షేర్‌బీబీపేట, తుజాల్పూర్, మల్కాపూర్, యాడారం తదితర గ్రామాల రైతులు ఆధారపడి ఉన్నారని తెలిపారు. చెరువు నిండకపోవడంతో వేల ఎకరాల సాగుభూములు ప్రభావితమవుతున్నాయని, వ్యవసాయ కూలీలకు కూడా పనులు తగ్గిపోయి ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి బీబీపేట చెరువును నింపేందుకు శాశ్వత పరిష్కారం చూపాలని పొర నరసింహులు డిమాండ్ చేశారు. మల్లన్నసాగర్ నుంచి ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయడంతో పాటు, అవసరమైన నిధులు కేటాయించి చెరువు కట్ట, తూములు, కాలువలను పునరుద్ధరించాలని కోరారు. రైతుల సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోతే రైతుల తరఫున మరింత పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.


