కోల్ బెల్ట్ న్యూస్(కరీంనగర్):
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరినప్పుడు వారిని బెదిరించడం, భయపెట్టడం సరైన పద్ధతి కాదని పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశంలో విస్తృతంగా చర్చించి పలు తీర్మానాలను ఆమోదించారు. బకాయిపడిన ఆరు డీఏలను వెంటనే విడుదల చేయాలని, 51 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేలా హెల్త్ కార్డులను అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఓపీ సౌకర్యంతో చెల్లుబాటు అయ్యే విధంగా అమలు చేయాలని తీర్మానించారు. అలాగే సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను పునరుద్ధరించాలని కోరారు.
జీవో 317 బాధిత ఉద్యోగులను వారి సొంత జిల్లాలకు సర్దుబాటు చేయాలని, జీవో నంబర్ 19ను అమలు చేసి మిగిలిపోయిన స్పౌజ్ కేసులను సొంత జిల్లాలకు సర్దుబాటు చేయాలని సమావేశంలో తీర్మానించారు. జీవో నంబర్ 25ను రద్దు చేసి ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడితో పాటు హెడ్మాస్టర్ పోస్టును ఏర్పాటు చేయాలని, ప్రాథమిక పాఠశాలల్లో తెలుగు, ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఉన్నత విద్యకు సంబంధించిన జీవో నంబర్ 342ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు. ఎలాంటి షరతులు లేకుండా నైతిక విలువలతో కూడిన విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. అదేవిధంగా ఉద్యోగి పదవీ విరమణ పొందిన రోజునే రూ.5 లక్షలను వారి ఖాతాలో జమ చేసే విధానం అమలు చేయాలని సమావేశంలో తీర్మానం ఆమోదించారు.ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, పెన్షనర్ల సంఘాల బాధ్యులు, తెలంగాణ రక్షణ సేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

