NIGAMA MEDIA (P) LTD
12.4 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Thursday, September 17, 2026

పైప్‌లైన్ టెండర్ నిబంధనలపై అనుమానాలు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

పోటీకి అవకాశం లేకుండా నిబంధనలు మార్చారన్న తెలంగాణ రక్షణ సేన ఆరోపణ

కోల్ బెల్ట్ న్యూస్(కరీంనగర్):

నగర పాలక సంస్థలో టెండర్ల ప్రక్రియకు సంబంధించి డి.బి. సెక్షన్ విధిస్తున్న ప్రత్యేక నిబంధనలు తరచూ వివాదాలకు దారితీస్తున్నాయని తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ ఆరోపించారు. నగర పాలక సంస్థలో పిలిచిన వాటర్ పైప్‌లైన్ టెండర్‌లో రిజిస్టర్డ్ కాంట్రాక్టర్లకు కాకుండా పైపుల తయారీ సంస్థలకు మాత్రమే అవకాశం కల్పించేలా నిబంధనలు రూపొందించడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.

గతంలో రూ.45 లక్షల విలువైన ఇదే తరహా పైప్‌లైన్ పనిని మ్యానుఫ్యాక్చరర్ నిబంధన లేకుండా టెండర్‌కు పిలవగా సుమారు 28 శాతం తక్కువ ధరకు పని దక్కిందని, దీంతో నగర పాలక సంస్థకు దాదాపు రూ.12 లక్షల ఆదా జరిగిందని హరిప్రసాద్ పేర్కొన్నారు. ప్రస్తుతం అదే పనికి సంబంధించి నిబంధనలు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందో అధికారులు ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.

కొంతమంది కాంట్రాక్టర్లకు అనుకూలంగా నిబంధనలు రూపొందించారనే ఆరోపణలపై మేయర్, కమిషనర్, ఇంజనీరింగ్ అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరారు. టెండర్లలో ఎక్కువ మంది అర్హులైన కాంట్రాక్టర్లు పాల్గొనేలా నిబంధనలు రూపొందించి పోటీ వాతావరణం కల్పించాలని సూచించారు. ప్రస్తుత టెండర్ ప్రక్రియను నిలిపివేసి, గతంలో ఉన్న విధానంలోనే టెండర్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.

టెండర్ల ప్రక్రియపై అవినీతి అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, లేకపోతే ఉన్నతాధికారులు, విజిలెన్స్, దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసి ప్రజా ఉద్యమం చేపడతామని హరిప్రసాద్ హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు రంగరవేణి లక్ష్మణ్ ముదిరాజ్, జిల్లా సీనియర్ నాయకులు కుతాడి శ్రీనివాస్, బసవేణి రాజేందర్, గర్షకుర్తి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.