NIGAMA MEDIA (P) LTD
13.6 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Saturday, August 29, 2026

కవిత టార్గెట్‌ హరీశ్‌రావేనా?

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

బీఆర్‌ఎస్‌లో హరీశ్‌ను ఒంటరి చేయడమే వ్యూహమా ?
కేసీఆర్‌ తర్వాత నాయకత్వంపై కవిత మాస్టర్‌ప్లాన్‌

కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్‌)

బీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వచ్చి తెలంగాణ రక్షణ సేనను ఏర్పాటు చేసిన కల్వకుంట్ల కవిత.. తన రాజకీయ వ్యూహంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావును ప్రధాన లక్ష్యంగా చేసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సాధారణ రాజకీయ విమర్శలకు భిన్నంగా ఇటీవల ఆమె చేస్తున్న తీవ్ర ఆరోపణలు బీఆర్‌ఎస్‌ అంతర్గత రాజకీయాలను మరోసారి తెరపైకి తెచ్చాయి. ముఖ్యంగా కేసీఆర్‌ ఆరోగ్యం దెబ్బతినడానికి హరీశ్‌రావే కారణమంటూ, ఆయన క్షుద్రపూజలు చేయిస్తున్నారంటూ కవిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపాయి.

అపనమ్మకం పెంచడమే లక్ష్యమా?

కవిత తాజా రాజకీయ కార్యాచరణ వెనుక ప్రధాన ఉద్దేశం బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో హరీశ్‌రావుపై అపనమ్మకాన్ని పెంచడమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాను బీఆర్‌ఎస్‌ నుంచి దూరం కావడానికి, కేసీఆర్‌ తనను రాజకీయంగా పక్కన పెట్టడానికి చోటుచేసుకున్న పరిణామాల వెనుక హరీశ్‌రావు పాత్ర ఉందనే భావన కవితలో బలంగా ఉందని ఆమె వ్యాఖ్యల తీరును బట్టి రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హరీశ్‌రావును పార్టీలో రాజకీయంగా ఒంటరి చేయగలిగితే.. చివరకు ఆయన బీఆర్‌ఎస్‌ను వీడే పరిస్థితి వస్తుందని, తద్వారా తన భవిష్యత్‌ రాజకీయ ప్రస్థానానికి మార్గం సుగమం అవుతుందని కవిత భావిస్తున్నారనే చర్చ సాగుతోంది.

హరీశ్‌ నిష్క్రమిస్తే బీఆర్‌ఎస్‌లో శూన్యమే..

బీఆర్‌ఎస్‌లో హరీశ్‌రావుకు ఉన్న రాజకీయ ప్రాధాన్యత దృష్ట్యా ఆయన పార్టీకి దూరమైతే ఏర్పడే పరిణామాలపైనా కవిత వ్యూహం ఆధారపడి ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కేసీఆర్‌ తర్వాత పార్టీ నాయకత్వంపై ఇప్పటికే కేటీఆర్‌ కేంద్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. హరీశ్‌రావు కూడా లేకపోతే బీఆర్‌ఎస్‌లో కీలకమైన ప్రత్యామ్నాయ నాయకత్వం ఖాళీ అవుతుందని కవిత అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్‌ నాయకత్వ శైలిపై పార్టీలోని కొంతమంది నేతలు, కేడర్‌లో ఉన్న భిన్నాభిప్రాయాలను తనకు అనుకూలంగా మలుచుకోవచ్చని ఆమె భావిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. హరీశ్‌రావు పార్టీకి దూరమైతే కేటీఆర్‌ రాజకీయంగా మరింత ఒంటరిగా మారతారని.. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ కేడర్‌ నాయకత్వం కోసం తన వైపు చూసే అవకాశం ఉంటుందని కవిత లెక్కలు వేసుకుంటున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

పాత టీఆర్ఎస్‌ భావజాలంతో పునరాగమనమేనా?

తెలంగాణ రక్షణ సేన ద్వారా కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేసిన కవిత.. భవిష్యత్‌లో బీఆర్‌ఎస్‌ రాజకీయాలను ప్రభావితం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారనే చర్చ కూడా ఉంది. ఒకవేళ బీఆర్‌ఎస్‌లో అంతర్గత విభేదాలు మరింత ముదిరి, కేటీఆర్‌–హరీశ్‌రావు మధ్య రాజకీయ సమీకరణాలు మారితే.. ఆ పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకోవచ్చని కవిత భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతిమంగా బీఆర్‌ఎస్‌ కేడర్‌ను తిరిగి తన వైపు తిప్పుకుని, పాత టీఆర్ఎస్‌ భావజాలాన్ని కేంద్రంగా చేసుకుని పార్టీలో తన రాజకీయ ప్రాధాన్యతను పునరుద్ధరించుకోవడమే కవిత వ్యూహంలో కీలక లక్ష్యమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

వ్యక్తిగత ఆరోపణలతో మానసిక ఒత్తిడి?

కొత్త రాజకీయ వేదిక ఏర్పాటు చేసిన తర్వాత కూడా హరీశ్‌రావే తనకు అతిపెద్ద రాజకీయ అడ్డంకి అన్న భావనకు కవిత వచ్చినట్లు ఆమె తాజా వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. అందుకే రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా వ్యక్తిగత అంశాలను ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేయడం ద్వారా హరీశ్‌రావుపై రాజకీయ, మానసిక ఒత్తిడి పెంచే ప్రయత్నం జరుగుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కవిత వ్యాఖ్యలకు హరీశ్‌రావు స్పందిస్తున్న తీరు మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. కవితను రాజకీయ ప్రత్యర్థిగా కాకుండా కేసీఆర్‌ కుమార్తెగా, కుటుంబ సభ్యురాలిగానే చూస్తున్నాననే భావనను ఆయన తన వైఖరి ద్వారా వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని తీవ్ర ఆరోపణలు వచ్చినా వ్యక్తిగత స్థాయిలో ఎదురుదాడికి దిగకుండా సంయమనం పాటిస్తున్నారు.

కవిత వర్సెస్‌ హరీశ్‌.. అసలు పోరాటం ఎక్కడ?

మొత్తంగా చూస్తే ఇది కేవలం కవిత–హరీశ్‌రావు మధ్య వ్యక్తిగత విభేదం కాదని, బీఆర్‌ఎస్‌ భవిష్యత్‌ నాయకత్వం చుట్టూ సాగుతున్న అంతర్గత రాజకీయ పోరాటంలో భాగంగానే తాజా పరిణామాలను చూడాల్సి ఉంటుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. హరీశ్‌రావును రాజకీయంగా బలహీనపరచడం ద్వారా బీఆర్‌ఎస్‌లో తనకు తిరిగి స్థానం కల్పించుకునే అవకాశం కోసం కవిత ప్రయత్నిస్తున్నారా? లేక ఇది వ్యక్తిగత విభేదాల నుంచి పుట్టిన రాజకీయ ఘర్షణ మాత్రమేనా? అన్నది రానున్న రోజుల్లో తేలాల్సి ఉంది.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.