NIGAMA MEDIA (P) LTD
26.4 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Thursday, August 20, 2026

ఉత్తర తెలంగాణపై బీఆర్ఎస్‌ ఫోకస్‌..

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

పూర్వ వైభవం కోసం వ్యూహం
బీజేపీ ప్రభావాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యం
కాంగ్రెస్‌ వ్యతిరేక ఓటును తమవైపు మళ్లించేందుకు కార్యాచరణ
స్థానిక సమస్యలే అజెండాగా వరుస ఆందోళనలకు సిద్ధం

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:

ఉత్తర తెలంగాణలో కోల్పోయిన రాజకీయ పట్టు తిరిగి సాధించేందుకు బీఆర్‌ఎస్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా బీజేపీ ప్రాతినిధ్యం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పార్టీ కార్యకలాపాలను విస్తరించేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకోవడంతో పాటు, బీజేపీ ప్రభావాన్ని తగ్గించడమే లక్ష్యంగా గులాబీ పార్టీ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.

బీజేపీ బలంగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి

ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో పార్టీ కార్యకలాపాలను మరింత విస్తరించాలని బీఆర్‌ఎస్‌ నాయకత్వం భావిస్తోంది. కాంగ్రెస్‌ వ్యతిరేక ఓటు చీలిపోకుండా వీలైనంత ఎక్కువగా తమవైపు మళ్లించడంపై దృష్టి పెడుతోంది. ఉత్తర తెలంగాణలో బీజేపీ ప్రభావం భవిష్యత్‌లో తమకు రాజకీయ సవాల్‌గా మారే అవకాశం ఉందని బీఆర్‌ఎస్‌ అంచనా వేస్తున్నట్లు సమాచారం.

స్థానిక సమస్యలే ప్రధాన అజెండా

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను విమర్శించడంతో పాటు స్థానిక సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. బీజేపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేపట్టి పార్టీ శ్రేణులను క్షేత్రస్థాయిలో క్రియాశీలం చేయాలని అధిష్ఠానం సూచించినట్లు సమాచారం.

నిజామాబాద్‌లో రైతు సమస్యలపై పోరాటం

కేసీఆర్‌ సూచనల మేరకు నిజామాబాద్‌ జిల్లాలో స్థానిక సమస్యలను బీఆర్‌ఎస్‌ ప్రధాన అజెండాగా తీసుకుంటోంది. యూరియా కొరత, పసుపు రైతుల సమస్యలు, వ్యవసాయ రంగానికి సంబంధించిన ఇతర అంశాలపై ఆందోళనలు చేపడుతోంది. రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలపైనా విమర్శలు చేస్తోంది.

సీసీఐ పునరుద్ధరణకు ఆదిలాబాద్‌లో మద్దతు

ఆదిలాబాద్‌ జిల్లాలో సీసీఐ పునరుద్ధరణ అంశాన్ని బీఆర్‌ఎస్‌ రాజకీయ అజెండాలోకి తీసుకొచ్చింది. సీసీఐ సాధన కమిటీ చేపడుతున్న ఆందోళనలకు మద్దతు ప్రకటించింది. కమిటీ ప్రతినిధులతో కలిసి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రిని కలిశారు. సీసీఐ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కూడా కేటీఆర్‌ లేఖ రాశారు.

సింగరేణి సమస్యలపై పోరాటానికి సిద్ధం

కరీంనగర్‌, పెద్దపల్లి, మంచిర్యాల తదితర ప్రాంతాల్లో సింగరేణి అంశాలను కూడా బీఆర్‌ఎస్‌ రాజకీయ కార్యాచరణలోకి తీసుకొస్తోంది. సంస్థకు సంబంధించిన సమస్యలు, కార్మికుల ఇబ్బందులు, అవినీతి ఆరోపణలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఈ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

పాత పట్టును తిరిగి సాధించడమే టార్గెట్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకోవడం, అదే సమయంలో ఉత్తర తెలంగాణలో బీజేపీ ప్రభావాన్ని తగ్గించడం ద్వారా పాత రాజకీయ ప్రాబల్యాన్ని తిరిగి సాధించాలన్న లక్ష్యంతో బీఆర్‌ఎస్‌ ముందుకు సాగుతోంది. రాబోయే రోజుల్లో మరిన్ని స్థానిక సమస్యలను గుర్తించి వాటిపై వరుస ఆందోళనలు, ప్రజా కార్యక్రమాలు నిర్వహించేందుకు పార్టీ కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మొత్తంగా ‘పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి’ అన్న వ్యూహంతో ఉత్తర తెలంగాణలో బీఆర్‌ఎస్‌ మళ్లీ పట్టు బిగించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.