Thirumala : సూర్య జయంతిని పురస్కరించుకొని శుక్లపక్ష సప్తమి తిథిలో వచ్చే రథ సప్తమి వేడుకలను టీటీడీ బోర్డు తిరుమలలో ఘనంగా నిర్వహించబోతోంది. ఫిబ్రవరి 4న ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహన సేవతో రథసప్తమి వేడుకలు ఘనంగా మొదలవుతాయి. రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవతో రథసప్తమి వేడుకలు ముగియనున్నాయి.
రథసప్తమి వేడుకలు నిర్వహించే మాడవీధుల్లో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. రథ సప్తమి వేడుకను పురస్కరించుకొని వెంకటేశ్వర స్వామికి నిర్వహించే అష్టాదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేసినట్టు టీటీడీ బోర్డు ప్రకటించింది. వీటితో పాటు ఎన్‌ఆర్‌ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్, వీఐపీ దర్శనాలను సైతం రద్దు చేసింది. ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే దర్శనం ఉంటుందని అధికారులు ప్రకటించారు.
ఒక్క రోజు నిర్వహించే రథ సప్తమి వేడుకలకు సుమారు రెండు లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేశారు. భద్రత, ట్రాఫిక్ సమస్యలు తలెత్త కుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది టీటీడీ బోర్డు. వేడుకలు ఆరోగ్యకరమైన వాతావరణంలో నిర్వహించడానికి అధికారులు గట్టి బందోబస్తు చేపడుతున్నారు. ఎలాంటి అపశృతి జరగకుండా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది కలిసి పర్యవేక్షణ చేయనున్నారు.