Karthika Masam : కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది. ఈ మాసంలో ఉపవాసంతో, భక్తి శ్రద్దలతో పూజలు చేస్తారు. నెలరోజుల పాటు ప్రతి హిందూ కుటుంబం పూజలు చేసి తమ భక్తిని చాటుకుంటారు. ఈ మాసంలో ఉసిరికాయకు భక్తులు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఉసిరిని నీటిలో వేసి సూర్యోదయానికి ముందే స్నానం చేస్తారు. ఉసిరికాయలతో దీపం పెట్టి తమ భక్తిని చాటుకుంటారు. ఉసిరికాయతోనే దీపం ఎందుకు వెలిగించాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కార్తీక పౌర్ణమి రోజున ఉసిరిదీపాలను వెలిగిస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని వేదంలో చెప్పబడింది. పౌర్ణమి రోజు ఉసిరికాయతో దీపాన్ని వెలిగించినచో శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా లభిస్తుందని భక్తుల నమ్మకం. అంతే కాకుండా ఉసిరికాయతో దీపాన్ని వెలిగిస్తే నవగ్రహాల దోషం ఉంటె కూడా తొలగిపోతుందని వేదపండితులు చెబుతున్నారు.
ఇంటికి సమీపంలో ఉన్న శివాలయంలో ఉసిరికాయతో దీపాన్ని వెలిగించాలి. శివాలయంలో ఎంపిక చేసుకున్న స్థలంలో వరిపిండితో ముగ్గులు వేయాలి. పసుపు, కుంకుమతో అలంకరించాలి. రెండు లేదా, మూడు ఉసిరికాయలను ఎంపిక చేసుకోవాలి. వాటిలో ఉన్న గుజ్జును తీసివేయాలి. ఆ కాయల్లో నెయ్యి నింపాలి. తామరకాడలతో చేసిన వత్తులను పెట్టి దీపం వెలిగించాలి. దీపాన్ని పసుపు, కుంకుమతో అలంకరణ చేయాలి. వాటిపై అక్షంతలు చల్లాలి. దీపాల చుట్టూ మూడు ప్రదక్షణలు చేస్తూ ఓం నమఃశివాయ అంటూ జపించాలి. ఈ విదంగా చేయడం వలన ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, తొలగిపోతాయి. నవగ్రహదోషం ఉన్నవారికి మంచి ఫలితాలు చేకూరుతాయని వేదంలో చెప్పబడింది.