intigreted school : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక విద్యపై దృష్టి సారించింది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేయడానికి సీఎం ఆదివారం నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఈ పాఠశాలలు ఏర్పాటు కాబోతున్నాయి. ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డ్ నియోజకవర్గం కొడంగల్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నియోజకవర్గం మధిర లో రెండు పాఠశాలలు ఎంపిక చేశారు. ఈ రెండు పాఠశాలలకు స్థలం ఎంపిక కూడ పూర్తయినది.
ప్రతి ఇంటిగ్రేటెడ్ పాఠశాలను సువిశాలమైన ఇరువై ఎకరాల్లో నిర్మించబోతున్నారు. ఇందులోనే ఎస్సి, ఎస్టీ , బీసీ , మైనారిటీ విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. ఆరు నుంచి పదో తరగతి వరకు తరగతులు నిర్వహిస్తారు. అన్ని వర్గాల విద్యార్థులకు ఒకే చోట రెసిడెన్షియల్ స్థాయిలో విద్యాబోధన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల కొరత ఉండదు. విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుంది. ప్రభుత్వానికి ఖర్చు కూడా తగ్గుతుంది. బోధనేతర సిబ్బంది సమస్య ఉండదు. విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది.
ఒకే చోట ఏర్పాటు చేయడంతో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఉపాధ్యాయులు కూడా అదే పాఠశాలలో ఉంటారు. దింతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. చదువుతోపాటు క్రీడలు, కంప్యూటర్ కోర్స్, మానసికంగా ఎదగడానికి శిక్షణ వంటి తరగతులు నిర్వహిస్తారు. వీటితోపాటు ఉన్నత చదువులకు విద్యార్థులను సన్నద్ధం చేయడానికి అవసరమైన శిక్షణ కూడా ఇచ్చే విదంగా ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు అందుబాటులోకి రాబోతున్నాయి.