BRS : తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైనది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం మూటగట్టుకుంది. అధికారం కోల్పోవడంతో కొందరు నాయకులు పొరుగింటి వైపు చూస్తున్నారు.మరికొందరు నేరుగా గులాబీ కండువా పక్కకుపెట్టి, మరో పార్టీ కండువా కప్పుకుంటున్నారు. అసెంబ్లీ పరాజయం నుంచి పార్టీ కోలుకోక ముందే పార్టీకి పార్లమెంట్ ఎన్నికల ఫలితం మరింత కుంగదీసింది. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థులుగా గెలిచిన నాయకులు అసెంబ్లీ ఫలితాల నుంచి నేటి వరకు ఒక్కొక్కరుగా గులాబీ కండువా తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు.
ఇప్పటి వరకు గులాబీ పార్టీని పక్కకు పెట్టి కాంగ్రెస్ కండువా కప్పుకున్నవారి సంఖ్య నాలుగు నుంచి ఐదుకు చేరింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లం వెంకట్రావ్ చేరారు. తాజాగా ఆదివారం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేరడంతో కాంగ్రెస్ లో చేరిన వారి సంఖ్య ఐదుకు చేరడం విశేషం.
కొందరు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మరి కొద్ధి రోజుల్లో మరో ఇరువై మంది ఎమ్మెల్యేలు గులాబీ గూడు వదిలి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని చెబుతున్నారు. భారత రాష్ట్ర సమితి పార్టీలో కీలక పదవులు పొందిన వారితో పాటు, ఎమ్మెల్యేలుగా గెలిచినవారు పార్టీని విడిచి పెట్టడం కూడా బిఆర్ఎస్ లో చర్చనీయాంశం అయ్యింది. అధినేత కేసీఆర్ నాయకులకు అభయం ఇస్తున్నప్పటికీ ఫలితం కనబడుతలేదు. మరి కొందరు నాయకులు నేరుగా అధినేత కేసీఆర్ తో మాట్లాడుతూ తాము పార్టీ వీడుతున్నట్టుగా వస్తున్న ప్రచారం అవాస్తవమని, బిఆర్ఎస్ లోనే కొనసాగుతామని మాట ఇస్తున్నారు.
బిఆర్ఎస్ శాసనసభ సభ్యుల సంఖ్య పడిపోతుంది. ఎన్నికలల్లో పార్టీ అభ్యర్థులుగా 39 మంది విజయం సాధించారు. అందులో కంటోన్మెంట్ అభ్యర్థి మరణించడంతో ఆ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. దింతో పార్టీ అభ్యర్థుల సంఖ్య 38 కి చేరింది. ఇప్పుడు 38 ఎమ్మెల్యేల నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీని వదిలివెళ్లడంతో 33 కు చేరింది. మరి కొద్ధి రోజుల్లో 20 మంది కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రకటిస్తున్నారు. అంతే కాదు రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీలో కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులే ఉంటారని కూడా కాంగ్రెస్ నాయకులు జోస్యం చెప్పడం విశేషం.