Parlament Result : తెలంగాణ రాజకీయాలపై ఆయనకు పూర్తి పట్టు ఉంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నుంచి మొదలు కొని ప్రస్తుత రాజకీయాల వరకు అనర్గళంగా చెప్పే సత్తా ఆయనలో ఉంది. ఎవరు ఎక్కడ గెలిచారు. ఏ పార్టీ అప్పుడు అధికారంలో ఉంది. ప్రభుత్వం ఉంటుందా, పోతుందా అనడానికి కూడా ఆధారాలతో సహా చెప్పేస్తారు ఆయన. ఎన్నికలు వచ్చాయంటే చాలు ఆయన ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో అనేది కూడా చెప్పేయగలరు. సర్వే లు చేయించి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో కూడా చెప్పగలరు. ఆయన మీడియా ముందు నోరు తెరిస్తే ఎవరి చరిత్ర బయటకు వస్తుందో అంతుపట్టదు. ఇప్పుడు తాజాగా తెలంగాణాలో ముగిసిన పార్లమెంట్ స్థానాల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ గెలుస్తారో చెప్పేశారు మాజీ ఎమ్మెల్యే గొనె ప్రకాష్ రావ్ .
రాష్ట్రంలో బీజేపీ పోటీ చేసిన 17 పార్లమెంట్ స్థానాలకు ఖచ్చితంగా ఆరు స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు. కాంగ్రెస్ ఐదు స్థానాల్లో భారీ మెజార్టీ సాధించి పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందన్నారు. మరో ఐదు స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ ఉంటదన్నారు .
జహీరాబాద్, మహబూబ్ నగర్, భువనగిరి పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు అతి తక్కువ మెజార్టీ తో బయటపడే అవకాశాలు ఉన్నాయని గొనె ప్రకాష్ రావ్ తెలిపారు. వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థికి దక్కే అవకాశం ఉందన్నారు. కరీం నగర్, నిజామాబాదు, సికింద్రాబాద్, మల్కాజిగిరి చేవెళ్ల, ఆదిలాబాద్ స్థానాల్లో కాషాయం అభ్యర్థులు విజయం సాధిస్తారని అన్నారు. హైదరాబాద్ లో తప్పనిసరిగా ఒవైసీ గెలువబోతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నల్గొండ, ఖమ్మం, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల్లో గెలువబోతున్నదన్నారు.
మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి ఎవరు గెలుస్తారో ఖచ్చితంగా చెప్పే అవకాశాలు కనబడుతలేదు. పోటీ మాత్రం బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ఉంటుందన్నారు. తెలంగాణలో బీజేపీ పోటీ చేస్తున్న స్థానాల్లో ప్రజలు అభ్యర్థులను చూసి బీజేపీ కి ఓటు వేయలేదన్నారు. కేవలం మోదీ పరిపాలన చూసి పార్టీ గుర్తుకు ఓటు వేస్తున్నారు. అంతే కానీ అభ్యర్థులకు ఓటు వేయడం లేదని మాజీ ఎమ్మెల్యే గొనె ప్రకాష్ రావు స్పష్టం చేశారు .