CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే భాషలో తేడా కనబడుతోంది. ఎవరైతే ఆయనని బూతు మాటలతో తిడుతున్నారో వారినే లక్ష్యంగా చేసుకొంటున్నారు. వాళ్ళు ఉపయోగించిన పదాలను తిరిగి వాళ్ళకే సీఎం రేవంత్ రెడ్డి అప్పచెబుతున్నారు. రాజకీయంగా దాదాపుగా అన్ని ప్రతిపక్ష పార్టీలతో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కొనసాగిస్తున్నారు సీఎం. కేవలం ఒక్క బిఆర్ఎస్ పార్టీ తోనే ఆయన ఢీ అంటే ఢీ అంటున్నారు. గులాబీ శ్రేణులు ఏ భాష ఉపయోగిస్తే సీఎం కూడా అదేవిదంగా స్పందిస్తున్నారు. పదేళ్ల సామ్రాజ్యం కోల్పోయింది బిఆర్ఎస్. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సమయం ఇవ్వకుండానే విమర్శలకు దిగింది. ఇచ్చిన హామీలపై నిలదీయడం పనిపెట్టుకుంది గులాబీ పార్టీ. సీఎంను విమర్శిస్తున్న బిఆర్ఎస్ మాటలు జర్నలిజానికి కూడా ఇబ్బందిగానే తయారైనాయి.
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ నాయకులు బూతులు మాట్లాడితే వాటిని ప్రసారం చేయరాదన్నారు. అంతటితో ఆగకుండా నాయకులు మాట్లాడిన బూతు మాటలను ప్రసారం చేసిన మీడియా సంస్థలపై కేసులు పెట్టి జైలు లో పెడితే మరోసారి అటువంటి మాటలను ప్రసారం చేయరని సీఎం చెప్పుకొచ్చారు. జైలు లో పెట్టాలనే మాటలు జర్నలిస్టులకు సైతం ఇబ్బందిగానే ఉన్నాయి.
అదే ఇంటర్వ్యూలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ని సీఎం సమర్ధించడం విశేషం. కిషన్ రెడ్డి పార్టీ పరంగా మాత్రమే తనను ఉద్దేశించి మాట్లాడారు. రాజకీయంగా మాట్లాడారు. పరిపాలన పరంగా మాట్లాడినారు. కానీ బూతుల ప్రయోగం తనపై ఎప్పుడు చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ అధినేత కిషన్ రెడ్డిని సమర్ధించడం విశేషం.