హిందూ సంఘాలు, బీజేపీలో వివిధ బాధ్యతలు నిర్వహించిన హరికృష్ణకు జిల్లా స్థాయి బాధ్యతలు
పార్టీ అభ్యున్నతికి, ఓబీసీ వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: బోయిని హరికృష్ణ
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మంచిర్యాల జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడిగా యువ నాయకుడు బోయిని హరికృష్ణ నియమితులయ్యారు. పార్టీతో పాటు వివిధ హిందూ సంఘాల్లో గతంలో ఆయన నిర్వహించిన బాధ్యతలు, అందించిన సేవలను గుర్తించి జిల్లా నాయకత్వం ఈ నియామకం చేపట్టినట్లు హరికృష్ణ తెలిపారు.
బోయిని హరికృష్ణ బాల్యం నుంచే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకలాపాలతో అనుబంధం కలిగి ఉంటూ, సామాజిక, హిందూ సంఘాల కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ వచ్చారు. ఈ క్రమంలో విశ్వహిందూ పరిషత్లో మంచిర్యాల పట్టణ ప్రధాన కార్యదర్శిగా, హిందూ ఉత్సవ సమితిలో పట్టణ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం భారతీయ జనతా పార్టీలో మంచిర్యాల పట్టణ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ పార్టీ కార్యక్రమాల్లో తన వంతు పాత్ర పోషించారు.
ఈ నేపథ్యంలో బోయిని హరికృష్ణకు బీజేపీ ఓబీసీ మోర్చా మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్ష పదవి కేటాయించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వెనుకబడిన తరగతుల ప్రజలకు పార్టీని మరింత చేరువ చేయడం, వారి సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి. చేయడం, యువతను సామాజిక, రాజకీయ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం వంటి అంశాల్లో ఓబీసీ మోర్చా కీలక పాత్ర పోషించనుంది.
తన నియామకంపై బోయిని హరికృష్ణ సంతోషం వ్యక్తం చేస్తూ, తనపై నమ్మకం ఉంచి జిల్లా స్థాయి బాధ్యతలు అప్పగించిన బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్కు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఆకుల అశోక్ వర్ధన్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు సహకరించిన పార్టీ పెద్దలు, నాయకులు, కార్యకర్తలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.
పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను క్రమశిక్షణతో, నిబద్ధతతో నిర్వర్తిస్తానని హరికృష్ణ పేర్కొన్నారు. జిల్లాలో బీజేపీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు, ఓబీసీ వర్గాల సమస్యలను పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానని వెల్లడించారు.

