కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ శివాలయానికి చేరుకుని నీటితో అభిషేకం చేయాలని కోరిన కొరివి నర్సింహులు
కోల్ బెల్ట్న్యూస్(బీబీపేట): కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో భగవంతుడి కరుణతో సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతూ సామూహిక ప్రార్థనలు నిర్వహించాలని కొరివి నర్సింహులు ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో బీబీపేట ప్రాంతంలో వర్షాలు కురవని సమయంలో గ్రామ ప్రజలంతా ఐక్యంగా పాత కసీర్ వద్ద ఉన్న శివాలయానికి చేరుకుని శివలింగానికి నీటితో అభిషేకం చేయగా, అనంతరం మంచి వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాయని గుర్తుచేశారు. గ్రామంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఉండేందుకు ఈ కార్యక్రమం దోహదపడిందని తెలిపారు.
అదే విధంగా ప్రస్తుతం కూడా వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నందున, ఈరోజు ప్రతి ఇంటిని పరిశుభ్రంగా చేసుకుని, రేపు ప్రతి కుటుంబం నుంచి ప్రజలు పాత కసీర్ వద్ద ఉన్న శివాలయానికి చేరుకుని నీటితో అభిషేకం చేయాలని కోరారు.
కులమత భేదాలు లేకుండా గ్రామ ప్రజలంతా ఐక్యంగా పాల్గొని భగవంతుడిని ప్రార్థించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అందరూ కలిసి సామూహికంగా ప్రార్థనలు చేయడం ద్వారా గ్రామంలో మంచి వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
వర్షాల కోసం సామూహిక ప్రార్థనలు చేయాలని పిలుపు

