21.5 C
Munich
Monday, August 3, 2026

కాంగ్రెస్‌లో నామినేటెడ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

వేగం పుంజుకున్న ప్రక్రియ
ఆదివారం ఉమ్మడి జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రుల కీలక సమావేశాలు
క్షేత్రస్థాయి నుంచి ఆశావాహుల జాబితా సేకరణ
సీఎం, టీపీసీసీ చీఫ్ ఆమోదంతో తుది జాబితా ప్రకటన

కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్):

తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఎట్టకేలకు అధికారికంగా వేగం పుంజుకుంది. పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరదించేందుకు ప్రభుత్వం, పార్టీ నాయకత్వం సమన్వయంతో ముందుకు సాగుతోంది. నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి మార్గదర్శకాలు, విధివిధానాలను ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్ఠానం పారదర్శకంగా, వేగవంతంగా నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది.

ఈ ప్రక్రియలో భాగంగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల (పీఏసీఎస్) ఛైర్మన్లు, డైరెక్టర్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవస్థాన కమిటీలు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల డైరెక్టర్లు, వివిధ బోర్డులు, కమిటీలతో పాటు ఇతర కీలక నామినేటెడ్ పోస్టులను దశలవారీగా భర్తీ చేయనున్నారు.

నియామకాల ప్రక్రియలో అర్హత, పార్టీ కోసం చేసిన సేవలు, సామాజిక సమతుల్యత, స్థానిక పరిస్థితులు వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. క్షేత్రస్థాయి నుంచి నిజమైన కార్యకర్తలు, ఆశావాహుల వివరాలతో కూడిన సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు పార్టీ నాయకత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

దీనిలో భాగంగా ఉమ్మడి జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులు ఆదివారం తమ పరిధిలోని జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు, గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, సీనియర్ నాయకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో వివిధ నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన పేర్లపై విస్తృతంగా చర్చించి, అర్హులైన అభ్యర్థుల జాబితాను ఖరారు చేయనున్నారు.

సమావేశాల అనంతరం జిల్లాల వారీగా రూపొందించిన నివేదికలను పార్టీ రాష్ట్ర నాయకత్వానికి అందజేయనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు కలిసి ఈ జాబితాలను పరిశీలించి, తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఆమోదం పొందిన అభ్యర్థుల జాబితాను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది.

నామినేటెడ్ పోస్టుల భర్తీతో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు లభించడంతో పాటు, సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని నాయకత్వం భావిస్తోంది. మరోవైపు, జిల్లాల వారీగా ఆశావాహుల సంఖ్య అధికంగా ఉండటంతో కొన్ని చోట్ల పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే పారదర్శక ప్రమాణాల ఆధారంగానే నియామకాలు చేపడతామని కాంగ్రెస్ నాయకత్వం స్పష్టం చేస్తోంది.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.