21 C
Munich
Sunday, July 26, 2026

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బర్తరఫ్ చేయాలి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd ,RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

నీట్ పరీక్ష రద్దుపై సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆగ్రహం
గోదావరిఖనిలో కేంద్ర విద్యాశాఖ మంత్రి దిష్టిబొమ్మ దహనం

కోల్ బెల్ట్ న్యూస్(గోదావరిఖని):

నీట్ పరీక్ష పత్రం లీక్ నేపథ్యంలో పరీక్షను రద్దు చేయడం ద్వారా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడిందని ఆరోపిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ డిమాండ్ చేసింది. పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం గోదావరిఖని గాంధీ చౌరస్తాలో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పార్టీ జిల్లా నాయకుడు ఈ. నరేష్ మాట్లాడుతూ, నీట్ పరీక్ష కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసి, సంవత్సరాల పాటు శ్రమించిన విద్యార్థులు పరీక్ష రద్దుతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని అన్నారు. పరీక్ష రద్దు కారణంగా ఇప్పటివరకు 20 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపిస్తూ, దీనికి కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా విద్యార్థి, యువజన సంఘాలు గత రెండు నెలలుగా ఆందోళనలు నిర్వహిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ 20 రోజుల పాటు చేపట్టిన నిరాహార దీక్షను కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా చర్చలు జరపకుండానే భగ్నం చేసిందని ఆరోపించారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా కోరుతూ ఢిల్లీలో పార్లమెంట్ వైపు ప్రదర్శన చేపట్టిన విద్యార్థులు, యువకులపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో పాటు భాష్పవాయు గోళాలు ప్రయోగించి పలువురిని గాయపరిచారని నరేష్ ఆరోపించారు. వందలాది మందిపై తప్పుడు కేసులు నమోదు చేయడంతో పాటు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్తేను అరెస్టు చేసి ఎక్కడ ఉంచారో కూడా వెల్లడించడం లేదన్నారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ, నిరుద్యోగ యువత భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శించిన ఆయన, నీట్ పరీక్ష రద్దు కారణంగా మరణించిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.1 కోటి చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే దేశవ్యాప్తంగా మరింత ఉధృతంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

 

 

ఈ నిరసన కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఐ. కృష్ణతో పాటు ఈదునూరి రామకృష్ణ, ఐ. రాజేశం, జీ. మల్లేశం, పుట్టపాక స్వామి, ఎం. దుర్గయ్య, ఎస్. రాజన్న, ఎం. కొమరయ్య, ఎడ్ల రవికుమార్, పోగుల శేఖర్, కే. పద్మ, శ్రీజ, కే. రజిత, ఏ. స్వప్న, కే. ఓదెమ్మ, ఎస్. సప్న, ఓ. సంధ్య, చింతల శేఖర్, యు. ప్రభాకర్, సాయికుమార్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.