22 C
Munich
Monday, July 27, 2026

ఒక ఉద్యమకారుడి ముచ్చట

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

A movement person :భారత విప్లవ చరిత్రలో రైతాంగ పోరాటాలతో పాటుగా కార్మిక పోరాటాలకు కూడా మహౌన్నతమైన స్థానం ఉన్నది. అలాంటి చారిత్రక ఘటనల్లో తెలుగు నేల మీద తనదంటూ ఒక పోరాటాన్ని, ధిక్కారాన్ని చరిత్రలో బద్రపరచుకున్నది సింగరేణి. ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం జిల్లాలో విస్తరించిన సింగరేణి బొగ్గుగనులోని కార్మికుల జీవితాలు దుర్భరంగా ఉండేవి. కనీస హక్కులు అమలు కాని యాజమాన్య నియంతత్వం నుండి కార్మికులను విముక్తి చేసే దిశగా జరిగిన పోరాటాలు చెప్పుకోదగినవి ఎన్నో ఉన్నవి. సింగరేణి కార్మికుల పోరాటం కేవలం కార్మికుల హక్కుల కోసం, హక్కుల సాధన కోసం మాత్రమే జరిగిన పోరాటంగా కాక భారతదేశ ఆర్థిక విధానాల పైన సామాజిక రుగ్మతల పైన పోరాడినటువంటి చరిత్ర సింగరేణి కార్మికులకు ఉన్నది. సింగరేణి బొగ్గు గనుల్లో ఉద్యోగిగా చేరి కార్మికుల హక్కుల కోసం పోరుబాటను ఎంచుకొని లాకప్పులు, పోలీసు చిత్రహింసలను, జైలు జీవితాన్ని, అజ్ఞాత జీవితాన్ని అనుభవించి ఆనాటి కాలానికి, పోరాట ఘట్టాలకు సాక్షి భూతమైన ఒక ఉద్యమకారుడు రాసిన తన జీవిత చరిత్రనే ”బొగ్గు రవ్వలు” పుస్తకం.

ప్రపంచ పోరాటాల చరిత్రలో ఉద్యమకారుడే స్వయంగా రచయితగా మారి రాసిన అనుభవాలను పుస్తకంగా తెచ్చిన వారు నాటికీ, నేటికీ చాలా తక్కువగా కనిపిస్తారు. అలాంటి బహు అరుదైన ఉద్యమ రచయితలలో గురిజాల రవీందర్‌ ఒకరు. ఇక్కడ చెప్పుకోదగిన విశేషమేమంటే రవీందర్‌ మొదటి నుండి రచయిత కాదు. గతంలో ఎలాంటి పుస్తకాలను ఆయన రాయలేదు. కానీ తాను చూసి అనుభవించిన జీవితంతో పాటు తాను భాగస్వామ్యమైన ప్రజా పోరాట కాలాన్ని అక్షరబద్ధం చేయడానికి ఆయన రచయితగా మారవలసిన అనివార్య స్థితిలోంచి ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది.

తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో పేరుకుపోయిన వెట్టి చాకిరి, భూస్వాముల దౌర్జన్యాలు, రైతు కూలీల సమస్యలపై విప్లవోద్యమం ప్రజలను చైతన్యపరచడంలో పూర్తి విజయాన్ని సాధించింది. ప్రజల కోసం జరుగుతున్న ఈ పోరాటం చివరకు విద్యారంగ సమస్యల సాధన కోసం విద్యార్థులను కూడా ప్రభావితం చేసింది. దానితో అనేక మంది విద్యార్థులు పోరాటంలో భాగస్వామ్యం అయ్యేందుకు గ్రామాల్లో ప్రజలను చైతన్యపరిచే బాధ్యతను తీసుకున్నారు. అదే సమయంలో తెలంగాణ లోని నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి కార్మికులను కూడా ఈ పోరాటాలు ప్రభావితం చేసాయి. సింగరేణి ఉద్యోగులందరూ ఇదే జిల్లాల లోని గ్రామీణ ప్రాంతాల్లో నుండి వచ్చిన వారు కావడం వల్ల, రైతు కూలీ కుటుంబాల నుండి వచ్చిన వారైనందువలన ఈ పోరాటాలు సింగరేణి కార్మికులను సహజంగానే ప్రభావితం చేయగలిగాయి.

గ్రామాల్లోని భూస్వామ్య సమస్యలు లాంటివే సింగరేణిలో ఉండటం వలన సింగరేణి యాజమాన్యం నియంతృత్వాలకు వ్యతిరేకంగా కార్మిక హక్కుల కోసం సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు.ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమంలో భాగంగా మందమర్రి, బెల్లంపల్లి ప్రాంతాల్లో ప్రజలను యువకులను చైతన్య పరుస్తున్న క్రమంలో రవీందర్‌ బెల్లంపల్లి కి చెందిన గంగారాంకు పరిచయ మయ్యాడు. సమాజ స్థితిగతులు ప్రజల బాధలు అవి మార్చవలసిన అవసరాన్ని గురించి గంగారం ఆలోచనలు రవీందర్‌ ను బాగా ప్రభావితం చేశాయి. అలా ప్రజల కోసం పనిచేయాలనే రవీందర్‌ ఆలోచన ఆయనను ఉద్యమంలో భాగస్వామ్యం చేసింది.

ప్రభుత్వం పోలీసులు ఉద్యమకారులను ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం, పరస్పర దాడులు దానితో పలువురు యువకులు ఉద్యమ బాట చేపట్టి అజ్ఞాతంలోకి వెళ్లారు. రవీందర్‌ ఆయన భార్య సరళ కూడా పోలీసులకు దొరకకుండా రహస్య జీవితంలోకి వెళ్లారు. పుస్తకం మొదటి నుండి చివరి వరకు కూడా వదిలిపెట్టకుండా చదివించే విధానంలో రవీందర్‌ తన మొదటి పుస్తకం తోనే విజయం సాధించారు. పూర్తిగా యదార్ధ జీవిత సంఘటనలను మాత్రమే చెప్పిన రవీందర్‌ – సరళ ల ఉద్యమ జీవిత కథ. జైలు జీవితం ఒక ప్రత్యేకమైన ఘట్టం. జైలు అనగానే మన అందరి దష్టిలో ఉండే ఒక నేరపూరిత వ్యక్తులు ఉండే చోటుగా కాకుండా ఒక భిన్నమైన ఆలోచనత్మకమైన, మేధోపరమైన చర్చలతో కొనసాగే వ్యక్తులు మనకు జైలులో కనిపిస్తారు.

ఎవరో అన్నట్టు జైల్లో ఉండవలసిన వారు బయట ఉన్నారు బయట ఉండవలసిన వారు జైల్లో ఉన్నారని అనిపిస్తుంది మనకు ఈ పుస్తకం చదివితే. రవీందర్‌ – సరళలు ఉద్యమం కోసం పనిచేసే క్రమంలో వేరువేరు చోట్ల ఉండాల్సి రావడం ప్రజల కోసం పనిచేసే క్రమంలో అజ్ఞాతంగా పోలీసులకు దొరకకుండా సరళ నెలల చంటి పిల్లతో ఊరూరు తిరగడం, దగ్గర వారు కూడా వాళ్ళ ఇళ్లలో ఉంచుకోవడానికి వెనకడుగు వేయడం అన్ని సంఘటనలు మన కళ్ళ ముందు సినిమా రీళ్ల మాదిరిగా కదులుతుంటాయి. నిజానికి అజ్ఞాత విప్లవ మహిళా జీవితాల గురించిన సాహిత్యం గాని స్వీయ చరిత్రలు గాని మనకు బహు అరుదుగా కనిపిస్తాయి.రవీందర్‌ పుస్తకంలో రాసిన ఆనాటి సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా నడుస్తుంది. భార్యాభర్తలిద్దరు ఉద్యమంలో పనిచేయడానికి వీలు లేకపోవటంతో ఉద్యమాన్ని వీడి బయటికి రావాలని నిర్ణయించుకోవడం, ఆ తర్వాత కోర్టులో లొంగిపోవడం వరకు పాఠకుడు ఎక్కడ ఆగకుండా చదివించే సన్నివేశాలు ఈ పుస్తకంలో మనకు కనిపిస్తాయి.

చాలావరకు విప్లవ సంఘాల్లో పని చేసేవారు విప్లవ నిబద్ధతను, నిర్బంధాలను తట్టుకోలేక విప్లవ పార్టీల నుండి దూరం అవ్వడం మనం చూస్తుంటాం. కానీ పనిచేయడానికి సరైన అవకాశం పార్టీ ఇవ్వలేదని పార్టీ నుండి బయటికి వచ్చిన రవీందర్‌ – సరళ లాంటి వారు విప్లవ జీవితంలో చాల తక్కువ. తాను రచయితను కాను అని ముందే గురిజాల రవీందర్‌ ఒప్పుకున్నారు.తన స్వీయ విప్లవ జీవితాన్ని మనకు చెప్పిన ఒక సంభాషణగానే భావించారు. కానీ ఈ పుస్తకం ఒక మంచి రచనగ భావించ వచ్చు. ఉద్యమకారుడే రచయితగా మారి రాసిన బహు అరుదైన ఒక కీలక ప్రక్రియను మనకు ఈ పుస్తకం పరిచయం చేస్తుంది. ఒక మంచి రచయితగా మారే అనేక లక్షణాలు రవీందర్‌ లో ఉన్నాయనే విషయాన్ని ఈ పుస్తకం మనకు చెప్పకనే చెబుతుంది. సామాజిక అంశాలను ఎత్తిచూపే అంశాలను ” పర్ఫెక్ట్ ప్రచురణ సంస్థ ” మాత్రమే పుస్తకాలను ప్రచురణ చేపడుతుంది. అటువంటి సంస్థ గురిజాల రవీందర్ రాసిన పుస్తకాన్ని ఆ సంస్థ ముద్రించడం అభినందించదగిన విషయం.
——————-
వ్యాసకర్త : చెమన్
9440385563
——————

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.