Bhadrachalam : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశికి ఎండోమెంట్ అధికారులు, ఆలయ కమిటీ, వేదపండితులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటీకే కలెక్టర్ జితేష్ వి పాటిల్ సమీక్ష సమావేశాన్ని సంబంధిత వారితో నిర్వహించారు. ఏర్పాట్ల కోసం ప్రభుత్వం రూ : 60 లక్షలు మంజూరు చేసింది.
శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని అధ్యయనోత్సవాలను వేద పండితులు ప్రారంభించారు. జనవరి తొమ్మిదో తేదీన గోదావరి నదిలో అంగరంగ వైభవంగా తెప్పోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి పదో తేదీన వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఉదయం ఐదు గంటల నుంచి ఉత్తర ద్వారం నుంచి సీతారాముల వారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
వైకుంఠ ఏకాదశి కి వచ్చి దర్శనం చేసుకునే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. తాగునీరు, వసతి, వైద్యం, పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. గోదావరి నది వద్ద స్నానాలకు ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ప్రతి భక్తుడికి తీర్థ ప్రసాదంతో పాటు భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.