Telugu desham party : హైద్రాబాద్ లో పార్టీ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడిన తీరు గమనిస్తే తెలంగాణ లో పార్టీ అభివృద్ధి కి ఆయన ముందడుగు వేసినట్టు తెలుస్తోంది. తెలుగు దేశం పార్టీ తెలంగాణలోనే పుట్టిందని అంటున్నారు. అంటే ఆయన తెలంగాణలో పార్టీ ని బలోపేతం చేయడానికి సిద్దమయ్యినట్టు తెలుస్తోంది. ఇప్పుడు తెలంగాణలో చేయడానికి చెప్పుకోదగ్గ కార్యక్రమాలు అంటూ ఏమీలేవు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం పోటీ చేయడానికి పార్టీ సిద్ధమైనట్టు తెలుస్తోంది. స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని చంద్రబాబు ఆలోచన.
ముందుగా రాష్ట్రంలో గట్టి పట్టున్న నాయకున్ని రాష్ట్ర అధ్యక్షున్ని చేయడానికి బాబు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అధ్యక్షున్ని ఎంపిక అనంతరం రాష్ట్ర, జిల్లాల కమిటీలను నియమించ నున్నారు. ఇదంతా కూడా స్థానిక ఎన్నికల సమయానికంటే ముందుగానే పూర్తి చేయడానికి బాబు సిద్ధమవుతున్నారని పార్టీ వర్గాల సమాచారం.
ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ పార్టీ అభిమానులు ఉన్నారు. ఇప్పటికి పార్టీ లోనే కొనసాగుతున్నవారు ఉన్నారు. ఏ పార్టీలో చేరకుండా తటస్తంగా ఉన్న నాయకులు సైతం ఉన్నారు. వీరందరిని ఏకతాటిపైకి తీసుకురాబోతున్నారు పార్టీ పెద్దలు. పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి కూడా తటస్తంగా ఉన్న నాయకులను ఫోన్ ద్వారా సంప్రదిస్తున్నారని సమాచారం. ఏది ఏమైనప్పటికి పార్టీ పూర్వ వైభవం కోసం బాబు త్వరలోనే తెలంగాణాలో పర్యటించే అవకాశాలు ఉన్నాయని తెలుగు దేశం పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నారు.