Telangana MLC : తెలంగాణ రాష్ట్ర శాసన మండలి రద్దు అవుతుందా ? రాజ్యాంగ నిబంధనల మేరకు మండలి కొనసాగింపు సాధ్యం అవుతుందా ? కాదా ? అనే ప్రశ్నలకు రాజ్యాంగ నిపుణుల నుంచి రద్దు అవుతుందనే సమాధానం వస్తుంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం తెలంగాణ శాసన మండలి కొనసాగాలంటే 120 మంది ఎమ్మెల్యేలు రాష్ట్రము నుంచి ప్రాతినిధ్యం వహించాలి. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు మాత్రమే శాసన సభలో ఉన్నారు. ఏ రాష్ట్రానికి అయినా కనీసం రాజ్యాంగం ప్రకారం 120 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే శాసన మండలి ఏర్పాటు చేయాలి. అప్పుడే కొనసాగుతుంది.
ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్య మంత్రి అయిన తరువాతనే శాసన మండలి ఏర్పాటు అయ్యింది. ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటి వరకు ఉన్న మండలిని రద్దు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అవసరమైనంత ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఆర్థిక భారం పేరిట ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తరువాత మండలిని రద్దు చేశారు.
తెలంగాణలో శాసన మండలి రాజ్యాంగ నిబంధనలకు విరుద్దంగా కొనసాగుతున్నదని ఎవరైనా రాష్ట్రపతికి గాని, కోర్ట్ కు గాని వెళితే రద్దు అవుతుందనే అభిప్రాయాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. 120 మంది ఎమ్మెల్యేలు లేనప్పుడు గడిచిన పదేళ్ళపాటు శాసన మండలి ఎలా కొనసాగిందనే అనుమానాలు సైతం రాజకీయ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. మండలిలో 38 మంది ఎమ్మెల్సీ లు ఉన్నారు. ఒకవేళ మండలి రద్దు అయితే వీరంతా కూడా ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళవలసిందేననే అభిప్రాయాలను సైతం కొందరు రాజ్యాంగ నిపుణులు వ్యక్తం చేయడం విశేషం.