Teachers demands : దీర్ఘకాలికంగా అపరిస్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ రూల్స్ సాధించడం కేవలం పీఆర్టీయూ -టీఎస్ తోనే సాధ్యమవుతుందని ఆ యూనియన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు టి ఇన్నారెడ్డి స్పష్టం చేశారు. యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల ZPHS(Boys) పాఠశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్బంగ ఇన్నారెడ్డి యూనియన్ నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి సర్వీస్ రూల్స్ ను సాధించడంతోనే అర్హులైన స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు ఎంఈఓ, డిప్యూటీ డిఇఓ , జూనియర్ లెక్చరర్, డైట్ లెక్చరర్ వంటి పోస్టులను పదోన్నతి ద్వారా పొందడానికి అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ సమస్య పరిస్కారం కోసం ఈ పాటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో యూనియన్ రాష్ట్ర నాయకులు సంప్రదించారని ఇన్నారెడ్డి వివరించారు. ముఖ్యమంత్రి సూచన మేరకు ఉమ్మడి సర్వీస్ రూల్స్ కి సంబంధించిన నివేదికను సీఎమ్ఓ అధికారి మాణిక్ రావు కు యూనియన్ అందజేయడం కూడా జరిగిందన్నారు. త్వరలోనే నిబంధనలు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
గత సంవత్సరంలో ఆగిపోయిన బదిలీలు పదోన్నతల షెడ్యూల్ ని గత నెలలో తిరిగి కొనసాగించి విజయవంతం కావడానికి ప్రధాన కారణం మన సంఘమేనని ఇన్నారెడ్డి స్పష్టం చేశారు. ఇంకా ఖాళీగా ఉన్న పోస్టులకు తొందరలోనే షెడ్యూల్ ని ఇప్పించి అర్హులైన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తామని అయన ఈ సందర్బంగా హామీ ఇచ్చారు. రిలీవ్ కాకుండా ఆగిపోయిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయించడానికి కూడా యూనియన్ ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నదన్నారు. బదిలీ వెబ్ ఆప్షన్ లో జరిగిన పొరపాట్లను 15 రోజుల్లోగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగిందన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పిఎస్ హెచ్ఎం పోస్టును మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
2003 డిఎస్సి తో నియామకం అయిన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ను వర్తింపచేయాలన్నారు. 317 జీవో వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులకు స్థానికత ఆధారంగా వారి స్థానిక జిల్లాలకు ఉపాధ్యాయులను కేటాయించే విధంగా పనులు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఉపాధ్యాయ మాసపత్రిక సంపాదక వర్గ సభ్యులు రాసపల్లి రవి, ప్రధానోపాధ్యాయురాలు సుధా, తోపాటు యూనియన్ నాయకులు పద్మజ, జ్యోతి, వెంకన్న, బాపురావు ,ఉదయ్, అంకతి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు