kousi kreddy : హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఈ మధ్య కాస్త ఆయన దూకుడు పెరిగింది. ఆ దూకుడు ఎవరి మీదనో కాదు. పక్కా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీదనే. సవాల్ కు ప్రతి సవాల్ విసురుతున్నారు కౌశిక్ రెడ్డి. గులాబీ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఏదయినా కార్యక్రమం చేపట్టాలంటే అధినేత కేసీఆర్ లేదంటే కేటీఆర్ అనుమతి తప్పనిసరి. చివరకు విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడాలి అంటే కూడా అనుమతి ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తో పోరుకు దిగారు. ఈ పోరు వెనుక ఉన్న డైరెక్టర్ ఎవరు. సొంతంగానే అధికార పార్టీతో పోరాటం చేస్తున్నారా ? లేదంటే పార్టీ పెద్దల అనుమతి ఉందా అనే అనుమానాలు సైతం రాజకీయ వర్గాల్లో కలుగుతున్నాయి.
ఇంత రాద్ధాంతం జరుగుతుంటే పార్టీని నడిపించే అధినేత నిశ్శబ్ద వాతావరణంలో ఉన్నారు. కేసీఆర్ డైరెక్షన్ లో నడవాల్సిన పార్టీలో ఇంత రచ్చ జరుగుతుంటే ఏమి పట్టనట్టుగా కేసీఆర్ ఎందుకు ఉన్నారు అనేది కూడా ప్రశ్నగా మిగిలింది. కేసీఆర్ మౌనంగానే ఉండటంతో పార్టీ పట్టు తప్పుతోందా అనే అనుమానాలు సైతం కలుగుతున్నాయి. గడిచిన కొద్ది రోజుల నుంచి ఆందోళనలు కేసీఆర్ కు తెలిసే జరుగుతున్నాయా అనే అనుమానాలు సైతం గులాబీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి.
అరికెపూడి గాంధీ తో చేస్తున్న పోరాటం ఎపిసోడ్ కేసీఆర్ కు తెలిసే జరిగిందా ? లేదంటే కౌశిక్ రెడ్డి సొంతంగా తయారు చేసుకున్న స్టోరీనా ? కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ ఎవరి అనుమతితో జరిగింది ? ఒకవేళ కేసీఆర్ కు తెలిసే జరిగిందంటే ఈ ఎపిసోడ్ ప్లాప్ అయినట్టే. కౌశిక్ రెడ్డి తయారు చేసుకున్న స్క్రిప్ట్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఒకవేళ కేసీఆర్ కు తెలియకుండా ఈ ఎపిసోడ్ నడుస్తే మాత్రం పార్టీపై కేసీఆర్ పట్టు కోల్పోయినట్టే భావించాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎమ్మెల్సీ కవిత జైలు లో ఉన్నది కాబట్టి కేసీఆర్ మానసికంగా ఇబ్బందుల్లో ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కౌశిక్ రెడ్డి విషయంలో కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదనేది పెద్ద ఫజిల్ అయ్యింది రాజకీయ వర్గాల్లో. ఇప్పటికే ఎవరికి తోచినట్టుగా వారు నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకుంది పార్టీ. రాబోయేది గ్రేటర్ ఎన్నికలు. ఈ నేపథ్యంలోనే కౌశిక్ రెడ్డి సెటిలర్ల విషయంలో నోరు జారారు. జరగాల్సిన నష్టం జరిగింది. ఇప్పటికయినా కేసీఆర్ మౌనం వీడి బయటకు రావాల్సిన అవసరం ఎంతయినా ఉంది. లేదంటే పార్టీ లో ఎవరి దారి వాళ్లు చూసుకుంటారు అనే గుసగుసలు కూడా మొదలైనాయి.