Ex CM Kcr : తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి. ప్రజలు కోలుకోడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. అధికార యంత్రాంగం సహాయ, సహకారాలు అందిస్తోంది. గులాబీ శ్రేణులు పర్యటిస్తూ వరద బాధితులను ఓదారుస్తున్నారు. ఇంత జరుగుతూన్నా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ఇల్లు దాటి బయటకు రావడం లేదు. కనీసం ఇంటివద్ద కూడా మీడియా తో వరదల గురించి మాట్లాడటం లేదు. ఇన్ని రోజులు కూతురు కవిత జైలు లో ఉన్నందున ఆందోళనలో ఉన్నారు. ఇప్పుడు కవిత జైలు నుంచి బెయిల్ పై వచ్చిన తరువాత కూడా కేసీఆర్ ఎందుకు ప్రజల్లోకి రావడం లేదనేది పెద్ద ఫజిల్ అయ్యింది బిఆర్ఎస్ శ్రేణుల్లో.
రాజకీయ విమర్శలు ఎన్ని వచ్చినప్పటికీ కేసీఆర్ మాత్రం తనకేమి పట్టనట్టుగానే ఉన్నారు. కేసీఆర్ ప్రజల్లోకి రావడానికి సిద్దంగానే ఉన్నట్టు బిఆర్ఎస్ శ్రేణుల సమాచారం. వినాయక చవితి ఉత్సవాలు ముగిసిన తరువాత కేసీఆర్ జనంలోకి రావడం ఖాయమంటున్నారు గులాబీ శ్రేణులు. పార్టీ అభివృద్ధికి తమిళనాడు లో డీఎంకే తీసుకుంటున్న చర్యలపై మాజీ విప్ బాల్క సుమన్ బృందం ఆ రాష్ట్రంలో పర్యటించింది. డీఎంకే నియమాలు, పార్టీ నిర్మాణం అంశాలపై కేసీఆర్ తన అనుచరులతో చర్చిస్తున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధానంగా రెండు హామీలు. ఒకటి రైతు భరోసా, రెండోది రైతు రుణమాఫీ. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైనదనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అదే విదంగా రైతు భరోసా పథకానికి ఎకరానికి పదిహేను వేల రూపాయలు అందజేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ విషయంలో నేటికీ కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఇప్పుడు కేసీఆర్ కు ఈ రెండు ప్రధాన అస్త్రాలైనాయి. ఈ రెండితో ఆయన నేరుగా రైతు నిరసన పేరుతొ కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధమైనట్టు పార్టీ వర్గాల సమాచారం.