BRS New Blood : పదేళ్లు ఎంతో మందికి రాజకీయ ఉపాధి కల్పించాం. ఎలాంటి ఉనికి లేని వారిని పార్టీలోకి తీసుకువచ్చి ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిపించాం. మంత్రులను చేశాం. కార్పొరేషన్ పదవులు ఇచ్చాం. పదేళ్ల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్నాం. ఇప్పుడు అధికారం కోల్పోవడంతో పార్టీని వీడుతున్నారు. పార్టీ గుర్తుపై గెలిచిన వారు వెళ్లిపోతున్నారు. ఓటమి చెందిన వారు కండువా మార్చుకుంటున్నారు. తెల్లవారేసరికి ఎవరు ఉంటున్నారు. ఎవరు వెళుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది గులాబీ పార్టీలో.
బిఆర్ఎస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు 39 మంది. అందులో నుంచి ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వారితో పాటు మరో ఎనిమిది మంది ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొందరు కూడా పార్టీని వదిలిపెట్టడానికి సిద్ధమవుతున్నారని పార్టీ వర్గాల సమాచారం. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. వరుసగా మాతృసంస్థను వదిలిపెట్టి కాంగ్రెస్ లోకి వెళ్లడం గులాబీ పెద్దలకు ఇబ్బందికరంగా తయారైనది. సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదనకుండా మరో అవకాశం ఇచ్చారు కేసీఆర్.
అయినా పార్టీని వదిలిపెట్టడం ఆందోళన కలిగిస్తోంది. కాంగ్రెస్ లో చేరితే రాబోయే ఎన్నికల్లో టికెట్ కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షణలు చేయాల్సి ఉంటుంది. రాబోయేది మన ప్రభుత్వమే. కాబట్టి తొందరపడి కాంగ్రెస్ లోకి వెళ్ళకండి అంటూ గులాబీ పెద్దలు సున్నితంగానే చెబుతున్నారు. అయినా పార్టీని వీడుతున్నారు. కాంగ్రెస్ లో చేరితే మరో నాలుగేళ్లు అధికారపార్టీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతాం. పదవులు అవసరం లేదు. అధికార పార్టీగా గుర్తింపు ఉంటె సరిపోతుందనే భావంతో గులాబీ ఎమ్మెల్యేలు కండువా మార్చుకోడానికి సిద్ధమవుతున్నారు.
పార్టీ ఎమ్మెల్యేలతో అధినేత కేసీఆర్ మాట్లాడుతూనే ఉన్నారు. అనుమానం వచ్చిన వారితో కూడా మాట్లాడుతూనే ఉన్నారు. అయినా గడపదాటి వెలుతున్నారు. వెళుతున్న వారికి ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెబుతున్నారు. అయినా కేసీఆర్ మాటకు కట్టుబడి ఉండటంలేదు. ఎక్కువమంది ఎమ్మెల్యేలు పార్టీ వీడితే రేవంత్ రెడ్డి బలోపేతం అవుతారు. రేవంత్ రెడ్డి ప్రయత్నాలను అడ్డుకోడానికి కేసీఆర్ ఎన్నో ఎత్తులు వేస్తున్నారు. అయినా ఫలితం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్టు పార్టీ వర్గాల సమాచారం. పార్టీ విడిచి వెళ్లిన వారి స్థానంలో కొత్త వారిని బలోపేతం చేయాలని కేటీఆర్ కు అధినేత చెప్పినట్టు తెలిసింది. అధినేత ఆదేశాల మేరకు కేటీఆర్ కూడా కొత్తవారిని నియోజకవర్గాల వారీగా ఎంపిక చేయడానికే సిద్ధమైనట్టు తెలిసింది.