BRS : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాలుగు గోడలకే పరిమితం అయ్యారు. కేవలం ఒకే ఒక్క రోజు అసెంబ్లీ సమావేశానికి కేసీఆర్ వచ్చి వెళ్లారు. కనీసం వరదల విషయంలో కూడా కేసీఆర్ నోరు మెదపక పోవడం విశేషం. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో గళం విప్పినా ఫలితం రాలేదు. సమస్య ఏదయినా కావచ్చు. స్పందించేది మాత్రం ఎక్కువగా కేటీఆర్, హరీష్ రావ్ లు మాత్రమే. అయినా ఆ ఇద్దరితో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం సాధ్యం కావడం లేదనే అభిప్రాయాలు పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి.
ప్రజల్లో అసంతృప్తి వస్తే పోతుంది. కానీ అదే ప్రజల్లో వ్యతిరేకత వస్తే మాత్రం నాయకులు తట్టుకోలేరు. ఈ విషయంలో కేసీఆర్ కు అనుభవం ఉంది. అందుకనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై రైతుల్లో ఏర్పడిన అసంతృప్తి వ్యతిరేకంగా మారడం కోసం కేసీఆర్ ఎదురుచూస్తున్నట్టుగా పార్టీ వర్గాల సమాచారం.
వంద రోజుల్లో ఆరు హామీలను నెరవేరుస్తామంటూ అధికారం చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. అధికారం చేపట్టి పది నెలలు గడిచింది. అయినా హామీల అమలు పూర్తికాలేదు. రైతు రుణమాఫీ, రైతు బందు హామీలు నేటికీ అపరిష్కృతంగానే ఉన్నాయి. ప్రధానంగా రైతు బందు, రైతు బోనస్ సమస్యలతో ప్రజల్లోకి కేసీఆర్ వెళ్లనున్నట్టుగా సమాచారం.
తెలంగాణ భవన్ లో ఈ నెల 18న కేసీఆర్ పార్టీ ముఖ్య శ్రేణులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం పార్టీ ప్రక్షాళనకు కీలకం కాబోతోంది. ఒక అత్యవసర బృందం, నిఘా టీం లను కూడా కేసీఆర్ ఏర్పాటు చేయబోతున్నారని సమాచారం. అదేవిదంగా ఉద్యమకారులకు కూడా పార్టీలో కీలక పదవులను ఇవ్వనున్నారని తెలిసింది. సమావేశం అనంతరం రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి సమావేశాలను కూడా కేసీఆర్ స్వయంగా నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్టు పార్టీ వర్గాల సమాచారం. అదేవిదంగా రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి రైతాంగం అభివృద్ధికి సలహాలు, సూచనలు కూడా కేసీఆర్ స్వీకరించనున్నట్టు పార్టీ శ్రేణుల సమాచారం.