BRS : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాటి నుంచి గులాబీ శ్రేణులు ప్రభుత్వ పనితీరును ఎండగడుతూనే ఉన్నారు. బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు రాష్ట్ర సమస్యలపై మీడియా తో మాట్లాడుతున్నారు. కొందరి మీడియా సమావేశం పార్టీకి మేలు చేసే విదంగా ఉండగా, మరికొందరి మాటలు పార్టీకి ఇబ్బందికరంగా తయారైనాయని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నారు. ఇది పార్టీకి తలనొప్పిగా ఉందనే అభిప్రాయాలు కూడా గులాబీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి.
తాజాగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు వివాదమవుతున్నాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చీర, గాజులు పంపుతున్నాను అంటూ ప్రకటించారు. ఆ ప్రకటన గులాబీ పార్టీ మహిళా నాయకురాళ్లకు ఇబ్బంది లేకపోయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలకు మాత్రం ఆగ్రహాన్ని తెచ్చింది. గాంధీ భవన్ వేదికగా నాయకురాళ్లు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పాడె కడుతామని హెచ్చరించారు. మహిళలు అంటే అంత చులకన ఎందుకు అంటూ ఎదురు ప్రశ్నించారు. తక్షణమే మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ విమర్శలు చేయడానికి మహిళలను కించపరచడం ఏమిటని ప్రశించారు. ఎన్నికల ప్రచారంలో భార్య, కూతురు ను అడ్డం పెట్టుకొని ఆత్మ హత్య చేసుకుంటా అంటూ ఏడ్చిన రోజు మరచిపోయావా అంటూ ప్రశ్నించారు.
కౌశిక్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టే పరిస్థితి కనబడుతలేదు. బిఆర్ఎస్ మహిళా నేతలు కూడా సమర్ధించే అవకాశం కూడా కనబడుతలేదు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దురుసు ప్రవర్తన పార్టీకి మేలు చేస్తుందా ? ఇబ్బంది కరంగా ఉందా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. కానీ కొత్త సమస్యలను మాత్రం తెచ్చిపెడుతున్నాడనే అభిప్రాయాలు సైతం పార్టీ నేతల్లో వ్యక్తం కావడం విశేషం.