Singareni : సింగరేణి బొగ్గు గని కార్మికులకు క్యాడర్ స్కీమ్ పదోన్నతులు ఇవ్వడానికి యాజమాన్యం అంగీకారం తెలిపిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజకుమార్ లు శనివారం తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా 420 మంది కార్మికులు క్యాడర్ స్కీమ్ పదోన్నతులకు అర్హత పొందారన్నారు. ఇందులో 60 మంది కార్మికుల వివరాలు సరిగా లేని కారణంగా వారికి పదోన్నతి రావడం లేదన్నారు. వారి వివరాలు సరిచేసిన అనంతరం పరిశీలించి వారికి కూడా పదోన్నతులు వచ్చే విదంగా కృషి చేస్తామన్నారు. మిగతా 360 మందికి ఒకేసారి పదోన్నతి పత్రాలను గనుల వారిగా అందజేయడం జరుగుతుందన్నారు.
గతంలో రెండు, మూడు దఫాలుగా ఇవ్వడం వలన కార్మికులు ఆర్థికంగా అలవెన్స్ రూపంలో నష్టపోవడం జరిగిందని వారు వివరించారు. అటువంటి పరిస్థితులకు తమ యూనియన్ యాజమాన్యం కు అవకాశం ఇవ్వకుండా ఒప్పందం చేసుకోవడం జరిగిందన్నారు. సెప్టెంబర్ 1 తేదీ నుంచి గనుల వారీగా పదోన్నతులు పొందిన కార్మికులకు దృవ పత్రాలు అందజేయడం జరుగుతుందన్నారు. సింగరేణి కార్మికులు ఆధరించి గుర్తింపు హోదా కట్టబెట్టిన నాటి నుంచి కార్మికుల పక్షాన ఉంటున్నామన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా తమ యూనియన్ బాధ్యతాయుతంగా పనిచేస్తున్నదని వారు స్పష్టం చేశారు.

by