CITU : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వంద పడకల ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలని CPM మంచిర్యాల జిల్లా కమిటీ కార్యదర్శి సంకె రవి డిమాండ్ చేశారు. ఆసుపత్రి వద్ద ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనాలు, చట్టబద్ధమైన సౌకర్యాలు సంబంధిత కాంట్రాక్టు సంస్థ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కానీ సంబంధిత అధికారుల నిర్లక్ష్యం మూలంగా పనిచేస్తున్న కార్మికులకు ఏ ఒక్క నెలలో కూడా సక్రమంగా జీతాలు వచ్చిన పరిస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత 6 నెలలుగా వేతనాలు రాకపోవడంతో కార్మిక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతం ఆవుతున్నారని అన్నారు. పిఎఫ్ పేరుతో కొత విధించిన డబ్బులు కూడా కార్మికుల ఖాతాలో జమకాడం లేదని ఆయన ఆరోపించారు. కార్మికులు తమ బాధలను సంబంధిత అధికారులకు చెప్పుకుంటే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
సంబంధిత శాఖల అధికారులు స్పందించి వెంటనే వేతన బకాయిలు చెల్లించాలని రవి ఈ సందర్బంగా డిమాండ్ చేశారు. లేనిచో కాంట్రాక్టు కార్మికుల ఆధ్వర్యంలో సీఐటీయూ జిల్లా వ్యాప్తంగా శాంతియుత పోరాటాలు చేస్తుందని రవి అన్నారు.