కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ఏడో తేదీన వేతనాలు చెల్లించాలి
ఉద్యోగ భద్రత కల్పించాలి
AITUC : సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికులు శ్రీరామ్ పూర్ ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం జీఎం కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి అక్బర్ అలీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు ముష్కే సమ్మయ్య, రీజియన్ కార్యదర్శి అఫ్రొజ్ ఖాన్, బ్రాంచ్ అధ్యక్షులు దొడ్డిపట్ల రవీందర్ లు మాట్లాడుతూ
సింగరేణి యాజమాన్యం పలు చర్చల్లో అంగీకరించిన ఒప్పందాలను సైతం విస్మరించి, కాలయాపన చేస్తోందని ఆరోపించారు. సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టు కార్మికులు ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కోల్ ఇండియా లో అమలవుతున్న హైపవర్ కమిటీ వేతనాలను కూడా ఇక్కడ కూడా అమలు చేయాలనీ వారు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. కోల్ మైన్స్ నిబంధనల ప్రకారం ప్రతి కాంట్రాక్టు కార్మికుడికి సిక్, లీవ్, విద్య, వైద్య సౌకర్యాలు అంద జేయాలన్నారు.
ఒకే కుటుంబం, ఒకే గమ్యం, ఒకే లక్ష్యం అనే నినాదం పేరుకే సింగరేణిలో కనబడుతున్నదని, కానీ యాజమాన్యం మాత్రం కాంట్రాక్టు కార్మికులపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణిలో ఖాళీగా ఉన్న క్వాటర్లను సీనియారిటీ ప్రకారం కాంట్రక్టు కార్మికులకు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న పని ఆధారంగా సెమీస్కిల్డ్ ,స్కిల్, హైలీ స్కిల్ వేతనాలు చెల్లించా లన్నారు. సెక్యూరిటీ గార్డ్ లకు వృత్తి పన్ను రద్దుచేసి ఉచితంగా యూనిఫామ్స్ అంద జేయాలన్నారు. యాజమాన్యం స్పందించి కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఆందోళనలను మరింత ఉద్రుక్తం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు రాచర్ల చంద్రమోహన్, ప్రభాకర్, సహాయ కార్యదర్శి చారి కోశాధికారి పల్లె సత్యం, సమ్మయ్య, గణేష్ , అనిత , శ్యామల, బాపు, లింగయ్య , సత్యనారాయణ , శ్రీనివాస్ , విజయ్, కొమరమ్మ తదితరులు పాల్గొన్నారు