congress leaders :కేంద్రంలో అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిని ఏర్పాటు చేసింది. బీజేపీ మూడోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు దేశమంతా కాంగ్రెస్ అగ్ర నాయకులు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, తోపాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అన్ని పార్లమెంట్ స్థానాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. బీజేపీ కి దీటుగా ప్రచారం చేస్తున్నారు.
పదేళ్ళపాటు కేంద్రంలో అధికారం కోల్పోవడంతో పార్టీ అంతర్గతంగా పట్టు కోల్పోయింది బలహీనమైన పార్టీని తిరిగి బలోపేతం చేయడానికి కేంద్రంలో అధికారం తప్పనిసరి. ఈ నేపథ్యంలో మిత్రపక్షాలతోనైనా కేంద్రంలో అధికారం చేపట్టాలనే పట్టుదలతో పార్టీ అగ్రనేతలు ఉన్నారు. అగ్రనేతలు ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ లు దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా ఖర్గే, ప్రియాంక, రాహుల్ పర్యటన తెలంగాణాలో ఖరారు అయ్యింది. ఈనెల 9,10,11 తేదీలలో రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేయనున్నారు.
ఈ నెల 9న రాహుల్ గాంధీ నర్సాపూర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సాయంత్రం నాలుగు గంటలకు పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం 6న ఎల్బీ స్టేడియం లో నిర్వహించే జనజాతర సభలో పాల్గొని ప్రసంగిస్తారు. 10న పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే హైదరాబాద్ లో మీడియా తో మాట్లాడుతారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు నకిరేకల్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. 11న ఉదయం 11 గంటలకు కామారెడ్డి లో ఏర్పాటు చేసిన జన జాతర సభలో ప్రియాంక గాంధీ పాల్గొంటారు. ఆ తరువాత మధ్యాహ్నం ఒంటి గంటకు తాండూర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అంతటితో కాంగ్రెస్ అగ్ర నేతల పర్యటన రాష్ట్రంలో పూర్తవుతుంది. వారి వెంట సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల సమాచారం.