sikasa : బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఇద్దరు జర్నలిస్టులను హెచ్చరిస్తూ సింగరేణి కోల్ బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ మీడియాకు విడుదల చేసిన లేఖ సంచలనం సృష్టించింది. బెల్లంపల్లిలో ఇద్దరు జర్నలిస్టులు విలేకరుల ముసుగులో తీవ్రమైన అరాచకాలకు పాల్పడుతున్నారని ప్రభాత్ ఆరోపించారు. పోలీసులతో మైత్రి సంబంధాన్ని, లంపెనిజాన్ని కొనసాగిస్తున్నారని అయన ఆరోపించారు. మహిళలపై అకృత్యాలకు పాల్పడుతూ భేదిరిస్తున్నారని, లొంగతీసుకోవడం లాంటి చర్యలకు పాల్పడుతున్నారని ప్రభాత్ తన ప్రకటనలో ఆరోపించారు.
1980 కి ముందు బెల్లంపల్లి లో ఉన్న పరిస్థితులను తలపిస్తూ దండు బాణేష్, కుందేళ్ళ శంకర్, దస్తగిరి లాంటి అరాచక వాదులను, రౌడీలను తలపిస్తున్నారని ఆయన ఆరోపించారు. బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఆ ఇద్దరు జర్నలిస్టులు తమ పద్ధతులు మార్చుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిచో కుందేళ్ళ శంకర్, దస్తగిరి గుండాలకు పట్టిన గతే వీళ్లకు తప్పదని ఆయన హెచ్చరించారు.
కోల్ బెల్ట్ ప్రాంతంలో కొంతమంది విలేకరుల ముసుగులో నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. జర్నలిజానికి మచ్చతెచ్చే విధానాలను కొంత మంది మానుకోవాలని ప్రభాత్ హెచ్చరించారు. ప్రజలను వేధిస్తూ, భయబ్రాంతులకు గురిచేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు కొందరు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. జర్నలిస్ట్ సంఘాలు తక్షణం కలుగజేసుకొని నకిలీ విలేకర్ల అసాంఘిక చర్యలను అడ్డుకోవాలన్నారు. అదేవిదంగా ప్రజలకు విలేకరులపై ఉన్న నమ్మకాన్ని కాపాడి ప్రజల గొంతుకయి అవినీతి, అక్రమాలను, దౌర్జన్యాలను రౌడీయిజాన్ని ఎండగడుతూ ప్రజలను చైతన్యవంతులను చేయడంలో ప్రధాన భూమిక పోషించగలదని ఆశిస్తున్నట్టు ప్రభాత్ తన లేఖలో కోరారు.
సికాస విడుదల చేసిన లేఖ నకిలీదని, ఎవరో గిట్టనివారు సృష్టించారనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. లేఖ పై సింగరేణి కోల్ బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ పేరు మాత్రమే ఉంది. లేఖపై ప్రభాత్ సంతకం లేకపోవడంతో నకిలీదేననే ఆరోపణలు సైతం బెల్లంపల్లిలో వ్యక్తం కావడం విశేషం. కేవలం తేదీ మాత్రమే పెన్నుతో రాసినవారు సంతకం ఎందుకు చేయలేదనే అభిప్రాయాలుసైతం వ్యక్తమవుతున్నాయి.