padmavibhushan Chiranjeevi : చిరంజీవి అంటేనే డ్యాన్స్ కు పెట్టింది పేరు. ఇప్పటికి చాలా మంది నటులు ఇండస్ట్రీలో ఆయన డ్యాన్స్ ను పొగుడుతుంటారు. నేల చూడకుండా డ్యాన్స్ చేయడం సినీ పరిశ్రమలో ఒక్క చిరంజీవికే సాధ్యమని కుండ బద్దలు కొట్టినట్టు చెబుతారు. సొంతంగా సినీ పరిశ్రమలో తనకంటూ ఎవరు లేకున్నా ఇష్టంతో పరిశ్రమలో అడుగుపెట్టి, కస్టపడి పైకి ఎదిగిన నటుడు చిరంజీవి. ఆయనను అంతగా ఆదరించి ఎంతో ఎత్తుకు తీసుకు వచ్చిన కళామతల్లిని కాదని రాజకీయాల్లో కాలుమోపారు. ఖద్దరు గూటి కంటే కళామతల్లి గొప్పదని భావించి తిరిగి పదేళ్ల తరువాత కెమెరా ముందు నిలబడ్డారు. అయినా పదేళ్లకు కూడా ఆయన డ్యాన్స్ లో వీసమెత్తు కూడా తేడా రాలేదు. పదేళ్లు దూరంగా ఉన్నప్పటికినీ ఆయన చేస్తున్న సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం గురువారం పద్మవిభూషణ్ అవార్డు తో ఘనంగా సత్కరించడం విశేషం.
మెగా స్టార్ చిరంజీవి సినిమా వస్తోందంటేనే అయన అభిమానులకు పెద్ద పండుగ. ఆయన అవార్డు తీసుకుంటున్నారంటే ఆ ప్రాంగణం అభిమానులకు సరిపోదు. అదికూడా గొప్ప పండుగల భావిస్తారు ఆయన అభిమానులు. 2006 లో కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్దు తో ఘనంగా సత్కరించింది. అదే సంవత్సరం ఆంధ్ర యూనివర్సిటీ డాక్టరేట్ అందజేసింది. 2016 లో రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్నారు. ఇంద్ర, స్వయం కృషి, ఆపద్బాంధవుడు సినిమాలకు ఉత్తమ నటుడిగా ఎంపికయి నంది అవార్డు ను అందుకున్నారు. భారత ప్రభుత్వం ప్రకటించిన ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ అఫ్ ది ఇయర్ పురస్కారానికి 2022 లో ఎంపికయినారు.
బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేసి ఎందరికో ప్రాణం పోశారు. ఐ బ్యాంకు స్థాపించి చూపులేనివారికి దారి చూపించారు. కరోనా సమయంలో సినీ పరిశ్రమకు చెందిన వారికీ వైద్య సహాయం చేసి ఆపద్బాంధవుడు అయ్యారు. ఇలా ఎన్నో సేవలు చేస్తూనే పదేళ్ల పాటు పరిశ్రమకు దూరంగా ఉన్నప్పటికీ, సేవలు అందించడాన్ని గుర్తించింది భారత ప్రభుత్వము. పద్మవిభూషణ్ అవార్డు తో ఘనంగా సత్కరించింది.
ఈ నేపథ్యంలో ఆయన అభిమానుల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయింది.