NIGAMA MEDIA (P) LTD
9.8 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Friday, October 23, 2026

కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా 25న హైదరాబాద్‌లో మహాధర్నా

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 25న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించనున్నట్లు సింగరేణి కాలరీస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయూ) మందమర్రి బ్రాంచ్‌ అధ్యక్షుడు ఎస్. వెంకటస్వామి, యూనియన్‌ కార్యదర్శి తుమ్మల రాజిరెడ్డి తెలిపారు. శుక్రవారం కేకే-5 గని వద్ద కార్మికులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా మహాధర్నాకు సంబంధించిన గోడపత్రికను కార్మికుల సమక్షంలో ఆవిష్కరించారు.

ప్రభుత్వ రంగ పరిశ్రమలను కాపాడాలని, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను రాష్ట్రంలో, ప్రభుత్వ రంగ సంస్థల్లో అమలు చేయవద్దని డిమాండ్‌ చేస్తూ ఈ మహాధర్నా చేపడుతున్నట్లు నాయకులు పేర్కొన్నారు. సింగరేణి సంస్థకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని, దసరా సందర్భంగా కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, సింగరేణిలో నూతన లేబర్‌ కోడ్‌లను అమలు చేయవద్దని డిమాండ్‌ చేశారు. కార్మికులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ గత కొన్ని సంవత్సరాలుగా నిరంతరం పోరాడుతోందని నాయకులు తెలిపారు. సంస్థకు రావాల్సిన బకాయిల సాధన కోసం గతంలో ఏప్రిల్‌లో విద్యుత్‌ సౌధ వద్ద ధర్నా నిర్వహించి విద్యుత్‌ సంస్థలపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు గుర్తుచేశారు. కార్మికులకు రావాల్సిన ప్రతి పైసా కోసం పోరాడుతున్నామని, గతంలో సీఎంపీఎఫ్‌ వడ్డీ రేటుకు సంబంధించి కార్మికులకు న్యాయం జరిగేలా కృషి చేశామని చెప్పారు. గత ఆరు నెలలుగా సీఎంపీఎఫ్‌ బ్యాలెన్స్‌పై కార్మికులు అయోమయానికి గురవుతున్న నేపథ్యంలో గోదావరిఖనిలోని కమిషనర్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి వినతిపత్రం అందజేసినట్లు వివరించారు.

12వ వేతన ఒప్పందం, లేబర్‌ కోడ్‌ల సవరణ అంశాలపై కోల్‌ ఇండియా యాజమాన్యానికి లేఖ రాసినా స్పందన లేదని విమర్శించారు. తెలంగాణకు చెందిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి సైతం ఈ అంశంపై స్పందించకపోవడం విచారకరమన్నారు. గతంలో వివిధ అంశాలకు అనుమతులు వచ్చినప్పుడు గొప్పలు చెప్పుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర కార్మిక సంఘాల నాయకులు, కోల్‌బెల్ట్‌ ప్రాంతాల్లో పర్యటించే రాజకీయ పార్టీల నాయకులు 12వ వేతన ఒప్పందంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ మందమర్రి బ్రాంచ్‌ అధ్యక్షుడు ఎస్. వెంకటస్వామి, యూనియన్‌ కార్యదర్శి తుమ్మల రాజిరెడ్డి, డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ అల్లి రాజేందర్‌, పిట్‌ సెక్రటరీ బద్రి ఆదర్శ్‌, బ్రాంచ్‌ ఉపాధ్యక్షుడు లింగాల సత్యనారాయణ, పిట్‌ ఇన్‌చార్జి సంకె వెంకటేష్‌, పిట్‌ కమిటీ సభ్యులు చీకటి వంశీ, చైతన్యరెడ్డి, నవీన్‌, ప్రశాంత్‌, కలవల శ్రీనివాస్‌తో పాటు పలువురు గని కార్మికులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.