వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్
తెలంగాణ రక్షణ సేన తొలి అభ్యర్థి ప్రకటన
ఎన్నికల సమన్వయకర్తగా సీనియర్ నేత సయ్యద్ ఇస్మాయిల్ నియామకం
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అభ్యర్థిగా తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రకటించారు. దసరా పండుగ శుభ ముహూర్తాన పార్టీ తరఫున ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే తొలి అభ్యర్థిగా శ్రీకాంత్ గౌడ్ పేరును ఖరారు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయ బాధ్యతల కోసం సీనియర్ నాయకుడు సయ్యద్ ఇస్మాయిల్‌ను రాష్ట్ర పార్టీ పరిశీలకుడిగా (స్టేట్ పార్టీ అబ్జర్వర్) నియమించారు.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర
ఉమ్మడి వరంగల్ జిల్లా (ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా) నర్సింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లికి చెందిన డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న ఆయన, తెలంగాణ జాగృతి ప్రారంభం నుంచే కల్వకుంట్ల కవితకు అండగా నిలిచారు. తెలంగాణ రక్షణ సేనలో పార్టీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తూ టీవీ ఛానళ్ల చర్చా కార్యక్రమాలు, ప్రజా సంఘాల సమావేశాల్లో పార్టీ వాణిని వినిపించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, రాజకీయ అనుభవంతో పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించారు.
తొలిసారి ఎన్నికల బరిలో తెలంగాణ రక్షణ సేన
తెలంగాణ రక్షణ సేన పార్టీ స్థాపించిన తర్వాత తొలిసారిగా శాసన మండలి ఎన్నికల్లో అభ్యర్థిని రంగంలోకి దించుతోంది. ఈ క్రమంలో వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి శ్రీకాంత్ గౌడ్‌ను తొలి అభ్యర్థిగా ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. బహుజనుల గొంతుకగా నిలుస్తూ గత మూడేళ్లుగా అనేక ఉద్యమాలు, ప్రజా సమస్యలపై పోరాటాలకు రూపకల్పన చేసిన కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికలోనూ అదే దృక్పథాన్ని కొనసాగించారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణ ఉద్యమకారుడికి అవకాశం కల్పించడం ద్వారా పార్టీ తన రాజకీయ ప్రస్థానంలో మరో కీలక అడుగు వేసింది.

