ఈ నెల 22న మంచిర్యాలలో నిర్వహణ
బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి నరెడ్ల శ్రీనివాస్
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):
బీసీల ఐక్యత, ఆత్మగౌరవం, హక్కుల సాధన, రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ గురువారం ఉదయం 11:30 గంటలకు మంచిర్యాల పట్టణంలోని ఎం కన్వెన్షన్ హాల్లో ‘బీసీ అలై బలై’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఐక్యతను చాటడంతోపాటు, హక్కుల సాధన కోసం ఐక్య ఉద్యమాన్ని బలోపేతం చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల నేపథ్యంలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమాజంలో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
కులగణన, రాజకీయ ప్రాతినిధ్యం, విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో బీసీలకు న్యాయమైన వాటా, సామాజిక న్యాయం వంటి కీలక అంశాలపై బీసీలంతా ఐక్యంగా గొంతెత్తాలని పిలుపునిచ్చారు. బీసీల హక్కుల పరిరక్షణ, సమాన అవకాశాల సాధన కోసం సంఘటితంగా ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమానికి బీసీ కుల సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, సింగరేణి ఉద్యోగులు, మేధావులు, మహిళా నాయకులు, యువతీ యువకులు, విద్యార్థులు, వృత్తి సంఘాల నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి బీసీ కుల సంఘం నాయకుడు, ఉద్యోగి, యువతీ యువకుడు, విద్యార్థి ఈ కార్యక్రమంలో పాల్గొని బీసీల ఐక్యతను చాటాలని విజ్ఞప్తి చేశారు.
“బీసీల ఐక్యతే మన బలం.. బీసీల ఆత్మగౌరవమే మన స్ఫూర్తి.. బీసీ రాజ్యాధికారమే మన లక్ష్యం” అనే నినాదంతో బీసీల హక్కుల సాధన దిశగా ఐక్య ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని నరెడ్ల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జిల్లా బీసీలందరూ పెద్ద సంఖ్యలో తరలివచ్చి బీసీ అలై బలై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సమాజ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కర్ణకంటి రవీందర్, జిల్లా ఉపాధ్యక్షుడు బొలిశెట్టి లక్ష్మణ్, జిల్లా కార్యదర్శి బియ్యాల సత్తయ్య, మంచిర్యాల సిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండీ షఫీ, సిటీ ఉపాధ్యక్షుడు ఎండీ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

