మహేంద్ర క్యాంపర్ వాహనం సీజ్
డ్రైవర్ కోసం పోలీసుల గాలింపు
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాసరావు నేతృత్వంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 12 పశువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పశువులను తరలిస్తున్న మహేంద్ర క్యాంపర్ వాహనాన్ని కూడా సీజ్ చేశారు. బుధవారం టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాసరావుకు అందిన సమాచారం మేరకు మందమర్రి ఏరియా టోల్‌ప్లాజా వద్ద ఎస్‌ఐ లచ్చన్న, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఆసిఫాబాద్ జిల్లా నుంచి జగిత్యాల జిల్లా రాజారాంపల్లి మార్కెట్‌కు పశువులను తరలిస్తున్న మహేంద్ర క్యాంపర్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు.
వాహనంలో 8 ఆవులు, 4 దూడలు.. మొత్తం 12 పశువులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వాహనాన్ని తనిఖీ చేసేందుకు పోలీసులు ఆపిన సమయంలో డ్రైవర్ వారిని గమనించి వాహనాన్ని అక్కడే వదిలి పరారైనట్లు పేర్కొన్నారు. పరారైన డ్రైవర్‌ను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న 12 పశువులతో పాటు మహేంద్ర క్యాంపర్ వాహనాన్ని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం మందమర్రి పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు.

