హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు.. ఘటనపై కార్మికుల్లో ఆందోళన
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
మందమర్రి ఏరియాలోని కేకే–5 గనిలో మంగళవారం పైకప్పు కూలిన ఘటనలో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. ప్రమాద సమయంలో గనిలో విధులు నిర్వహిస్తున్న పలువురు కార్మికులు భయాందోళనకు గురయ్యారు. గాయపడిన కార్మికులను హుటాహుటిన రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
సమాచారం మేరకు.. కేకే–5 గనిలో మొదటి షిఫ్ట్‌లో కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం సుమారు 9.30 గంటల సమయంలో గని లోపలి భాగంలో పైకప్పు కూలినట్లు సమాచారం. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులకు గాయాలయ్యాయి. వెంటనే తోటి కార్మికులు వారిని బయటకు తీసుకువచ్చి ఆసుపత్రికి తరలించారు.

ప్రమాద విషయం తెలుసుకున్న అధికారులు, యూనియన్ నాయకులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను కోరారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టి, గనిలో భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని కార్మికులు కోరుతున్నారు.

