NIGAMA MEDIA (P) LTD
11.5 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, August 23, 2026

కాంగ్రెస్‌లో మౌనం.. రేవంత్‌కు మద్దతెంత?

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కొండా సుష్మిత వ్యాఖ్యలతో వేడెక్కిన కాంగ్రెస్ రాజకీయాలు.. సురేఖపై చర్యలకు డిమాండ్
గాంధీభవన్ సమావేశానికి 66 మందిలో 17 మంది ఎమ్మెల్యేలే హాజరు
మంత్రుల మౌనంపై చర్చ.. అధిష్ఠానం నిర్ణయం కోసం ఎదురుచూపులు?

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:

తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సుష్మిత వ్యాఖ్యల వ్యవహారం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డిపై సుష్మిత చేసిన వ్యాఖ్యలు పార్టీ అంతర్గత విభేదాలను మరోసారి తెరపైకి తెచ్చాయి. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని అటవీశాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేసినప్పటికీ.. సుష్మిత మాత్రం తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

తన పోరాటం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాదని, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలకు తాను విధేయురాలినని, తన పోరాటం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపైనే కొనసాగుతుందని సుష్మిత మరోసారి స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యవహారం వ్యక్తిగత విమర్శల స్థాయిని దాటి పార్టీ అంతర్గత రాజకీయాలకు దారితీస్తుందా అన్న చర్చ మొదలైంది.

సురేఖను బర్తరఫ్ చేయాలని డిమాండ్

ఈ పరిణామాల నేపథ్యంలో శుక్రవారం గాంధీభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డికి మద్దతుగా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మీడియా సమావేశం నిర్వహించారు. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలపైనా చర్యలు తీసుకోవాలని కోరారు.
అయితే ఈ సమావేశంలో మంత్రులు ఎవరూ పాల్గొనకపోవడం, రేవంత్‌రెడ్డికి బహిరంగంగా మద్దతు ప్రకటించకపోవడం ఇప్పుడు కాంగ్రెస్‌లో కొత్త చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రిపై ఇంతటి తీవ్ర ఆరోపణలు వచ్చిన సమయంలోనూ ఒక్క మంత్రి కూడా స్పందించకపోవడంపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

66 మంది ఎమ్మెల్యేల్లో 17 మందే హాజరు

కాంగ్రెస్‌కు శాసనసభలో సొంతంగా 66 మంది సభ్యుల బలం ఉంది. అయితే గాంధీభవన్‌లో జరిగిన సమావేశానికి కేవలం 17 మంది ఎమ్మెల్యేలే హాజరయ్యారు. ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, బస్వరాజు సారయ్య కూడా సమావేశంలో పాల్గొన్నారు.

సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేల్లో బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, బాలు నాయక్, చిక్కుడు వంశీకృష్ణ, మనోహర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణ, కె.ఆర్. నాగరాజు, రాజేశ్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కుందూరు జయవీర్‌రెడ్డి, బి. లక్ష్మారెడ్డి, వెడ్మ బొజ్జు, మందుల సామేల్ ఉన్నారు. దీంతో మిగతా ఎమ్మెల్యేలు ఎందుకు సమావేశానికి దూరంగా ఉన్నారు? వారంతా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉన్నారా? లేక ప్రస్తుత పరిణామాలను నిశితంగా గమనిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం కోసం వేచి చూస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ప్రాంతీయ సమీకరణాలపైనా చర్చ

గాంధీభవన్ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేల విషయంలోనూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి సొంత జిల్లా మహబూబ్‌నగర్‌కు చెందిన నేతలు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మద్దతుదారులుగా భావించే నల్లగొండ ప్రాంత ఎమ్మెల్యేలు, కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలే ప్రధానంగా సమావేశంలో కనిపించారని విశ్లేషిస్తున్నారు. దీంతో ఇది కేవలం ముఖ్యమంత్రికి మద్దతుగా జరిగిన సమావేశమా? లేక పార్టీలోని ఒక వర్గం బలప్రదర్శనగా మారిందా? అనే చర్చ కూడా మొదలైంది.

మంత్రుల మౌనం ఎందుకు?

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మంత్రివర్గంలోని 14 మంది సభ్యుల మద్దతు ఉన్నప్పటికీ, తాజా వ్యవహారంపై వారిలో ఒక్కరు కూడా బహిరంగంగా స్పందించకపోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలోనూ సుష్మిత ఆరోపణలు చేసిన సందర్భాల్లో మంత్రులు పెద్దగా స్పందించలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగడం వెనుక కారణాలేమిటన్నది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు కొండా సురేఖ బీసీ సామాజికవర్గానికి చెందిన కీలక నాయకురాలు కావడంతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయంగా ప్రభావం ఉన్న నేతగా ఉన్నారు. ఆమెపై చర్యలు తీసుకునే విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఆచితూచి వ్యవహరిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, చిన్నారెడ్డిలపై చర్యలు తీసుకోకుండా కేవలం కొండా సురేఖపై చర్యలు తీసుకుంటే పార్టీకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందన్న వాదన కూడా వినిపిస్తోంది. దీంతో ముగ్గురు నేతల వ్యవహారాన్ని అధిష్ఠానం ఎలా పరిష్కరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

రేవంత్ తిరిగొచ్చాక ఏం జరుగుతుంది?

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లండన్ పర్యటన ముగించుకుని శనివారం రాష్ట్రానికి తిరిగి రానున్నారు. ఆయన రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఈ వివాదంపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తారా? పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలపై హెచ్చరించి వదిలేస్తారా? లేక సుష్మిత వ్యాఖ్యల వ్యవహారాన్ని అధిష్ఠానం స్థాయిలోనే పరిష్కరిస్తారా? అన్నది వేచి చూడాల్సి ఉంది.
ఇప్పటివరకు బహిరంగంగా కనిపిస్తున్న పరిణామాల కంటే.. మంత్రులు, ఎమ్మెల్యేల మౌనం వెనుక ఉన్న రాజకీయ లెక్కలే తెలంగాణ కాంగ్రెస్‌లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.